calender_icon.png 27 September, 2024 | 4:50 AM

ఏఈఈ అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి

26-09-2024 07:18:04 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ఎర్రమంజిల్‌లోని జల సౌధ గ్రౌండ్స్‌లో నూతనంగా నియమితులైన ఏఈఈలకు నియామక పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... క్షేత్రస్థాయిలో బాగా తిరిగితే మంచి అవగాహన ఉందని, నిర్ణయాలు తీసుకుంటే తప్పులు దొర్లే అవకాశం తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. నాణ్యత లోపిస్తే ప్రాజెక్టులు దీర్ఘకాలం నిలబడవని, నాణ్యత లేకుంటే.. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ఇన్నేళ్లు ఉండేవి కావని సీఎం తెలిపారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు దశాబ్దాల క్రితం నిర్మించిన్నవి కానీ, ఐదేళ్ల క్రితం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడే కూలిపోయిందని ఆయన వెల్లడించారు.

నిర్మాణం పూర్తికాకముందే కూలిన కాళేశ్వరాన్ని ఎలా భావించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును గత పాలకులు ప్రపంచ అద్బుతంగా వర్ణించారని ముఖ్యమంతి ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇప్పుడు ఎవరిని బాధ్యులుగా చేయాలి? అని  ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో ఇంజనీర్లు సమర్థంగా పనిచేసే ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదు, సామగ్రి నాణ్యతగా లేదని ఇంజినీర్లు చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.