26-02-2025 04:36:00 PM
న్యూఢిల్లీ: హైదరాబాద్ మహా నగరంలో మెట్రో రైలు సౌకర్యం అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తేవడానికి ఉద్దేశించిన మెట్రో రైల్ ఫేజ్-IIకు అనుమతించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని విజ్ఞప్తి(Revanth Reddy Appeals to Prime Minister Modi) చేశారు. గత ప్రభుత్వం పదేళ్లుగా హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణపై దృష్టి సారించలేదని ప్రధానమంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. హైదరాబాద్ నగరంలో ఫేజ్-II కింద రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కి.మీ పొడవైన 5 కారిడార్లను ప్రతిపాదించామని వివరించారు. మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని వారి నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రీజినల్ రింగు రోడ్డు (Regional Ring Road) ఉత్తర భాగంలో ఇప్పటికే 90 శాతం భూ సేకరణ పూర్తయినందున దక్షిణ భాగాన్ని వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఉత్తర భాగంతో పాటే దక్షిణ భాగం పూర్తయితే ఆర్ఆర్ఆర్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోగలమని తెలిపారు. దక్షిణ భాగం భూ సేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం భరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రికి సీఎం తెలిపారు.
ఆర్ఆర్ఆర్‌కు సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టు(Regional Ring Rail Project) ప్రతిపాదన ఉందని వివరించారు. ఈ రీజినల్ రింగ్ రైలు పూర్తయితే తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని రైలు మార్గాలతో అనుసంధానత (కనెక్టవిటీ) సులభమవుతుందని, రీజినల్ రింగ్ రైలుకు అనుమతి ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణకు వస్తువుల ఎగుమతులు, దిగుమతులు సులువుగా చేసేందుకు రీజినల్ రింగు రోడ్డు సమీపంలో డ్రైపోర్ట్ అవసరమని, ఆ డ్రైపోర్ట్ నుంచి ఏపీలోని సముద్ర పోర్ట్ లను కలిపేందుకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు తో పాటు రోడ్డును ఆనుకొని సమాంతరంగా రైలు మార్గం మంజూరు కోరారు. తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మికత మూసీ నదితో ముడిపడి ఉందని, రాజధాని హైదరాబాద్ నగరం(Hyderabad city) మధ్యగా మూసీ ప్రవహిస్తోందన్నారు.
అంత ప్రాధాన్యం కలిగి ఉన్న మూసీ పునరుజ్జీవనానికి(Musi River Revival) సహకరించాలని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈసా, మూసా నదుల సంగమంలో ఉన్న బాపూ ఘాట్ అభివృద్ధి, మూసీ ప్రక్షాళనకు 27 ఎస్టీపీల నిర్మాణం, మూసీ రిటైనింగ్ వాల్స్, కరకట్టల నిర్మాణం, మూసీ గోదావరి నదుల అనసంధానంతో కలిపి మొత్తంగా ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు ఆర్థిక సహాయం అందచాలని కోరారు. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్(Gandhi Sarovar Project) కు 222.7 ఎకరాల రక్షణ భూముల బదిలీకి సహకరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 61 ఐపీఎస్ కేడర్ పోస్టులు వచ్చాయని, 2015లో రివ్యూ తర్వాత మరో 15 పోస్టులు అదనంగా వచ్చాయని, సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసులు పెరగడం, రాష్ట్రంలో పెరిగిన పట్టణాలు, ఇతర అవసరాల దృష్ట్యా తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలన్నారు. సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు అనువైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నందున ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ప్రాజెక్టు(India Semiconductor Mission)ను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు అనమతించాలని సీఎం ప్రధాని మోదీని కోరారు.