హైదరాబాద్: రాష్ట్రంలోని వసతిగృహాల్లో తరచూ ఫుడ్‌పాయిజన్ ఘటనలు చోటుచేసుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలి, ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి సమగ్ర నివేదికలు సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. విద్యార్థులకు ఆహారం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులైన సిబ్బంది లేదా అధికారులను తొలగించడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్యలను సత్వరమే పరిష్కరించి ప్రభుత్వ సంస్థల గౌరవాన్ని కాపాడాలని అధికారులను ఆదేశించారు. హాస్టళ్లలో తిండిపై తప్పుడు వదంతులు ప్రచారం చేస్తూ, తల్లిదండ్రుల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తూ ప్రభుత్వం పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారాలు, కల్పిత నివేదికలపై కఠినంగా వ్యవహరిస్తామని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు.