30-03-2025 12:28:49 PM
భట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్ షడ్రుచుల కలయిక
ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నా
ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ కు గుర్తింపు
ఫ్యూచర్ సిటీ అంటే ప్రజలు నివసించే నగరమే కాదు.. పెట్టుబడుల నగరం
ఆదాయాన్ని పెంచాలి.. పేదలకు పంచాలనేదే భట్టి ఆలోచన
లక్షలాది మందికి ఉపాధి కల్పించేలా ఫ్యూచర్ సిటీ
హైదరాబాద్: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతి( Ravindra Bharathi)లో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది(Sri Viswavasu Nama Samvatsara Ugadi) వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్ పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ఈ ఏడాది రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉంటారని భావిస్తున్నానని తెలిపారు. మా ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తుందని పేర్కొన్నారు.
ప్రజలందరికీ అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka) అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ షడ్రుచుల కలయిక మాదిరి ఉందని సీఎం స్పష్టం చేశారు. బడ్జెట్ లో విద్య, వైద్యం, మౌలికసదుపాయాలకు అధిక నిధులు కేటాయించామని తెలిపారు. పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు అదుపులో ఉండాలని సీఎం వెల్లడించారు. ప్రజల సంక్షేమం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి(Development of Telangana State) కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటామని చెప్పారు. నేను, భట్టి విక్రమార్క జోడెద్దుల్లా రాష్ట్రం కోసం శ్రమిస్తున్నామని తెలిపారు. దేశానికి తెలంగాణ ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుతామన్నారు.
ప్రపంచస్థాయిలో హైదరాబాద్ కు గుర్తింపు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి యత్నిస్తున్నామని సీఎ రేవంత్ స్పష్టం చేశారు. దేశంలో కొత్త నగరం నిర్మించాల్సిన అవసరం ఉంది.. దేశానికే ఆదర్శంగా ఉండేలా కొత్త నగరం నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఫ్యూచర్ సిటీ వంటి కొత్త నగరం నిర్మించాల్సిన అవసరాన్ని సీఎం నొక్కి చెప్పారు. ఫ్యూచర్ సిటీ(Telangana's Future City) అంటే ప్రజలు నివసించే నగరమే కాదు.. పెట్టుబడుల నగరం.. లక్షలాది మందికి ఉపాధి కల్పించేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపట్టాలన్నారు. మూసీ ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ ఇందులో భాగమేనని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
అభివృద్ధి జరుగుతున్నప్పుడు కొన్ని అడ్డంకులు తప్పవన్న రేవంత్ రెడ్డి(CM Anumula Revanth Reddy) ఏ విధానానికి నూటికి నూరు శాతం ఆమోదం ఉండదని వివరించారు. దేవుళ్లను విశ్వసించే విసయంలోనే ఏకపక్ష ఆమోదం ఉండదన్నారు. శ్రీమంతులు మాదిరే పేదలూ సన్నబియ్యం తినాలని ఆకాంక్షిస్తున్నారని ఆయన వెల్లడించారు. గతేడాది 1.56 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తిని సాధించామని వివరించారు. దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత భారీగా వరి ఉత్పత్తి జరగలేదని సీఎం స్పష్టం చేశారు. సన్న బియ్యం పండిస్తే బోనస్ కూడా ఇస్తున్నామని గుర్తుచేశారు. రాష్ట్రంలో 60 నుంచి 65 శాతం మంది సన్న బియ్యం పండిస్తున్నారు. ఆదాయాన్ని పెంచాలి.. పేదలకు పంచాలనేదే భట్టి ఆలోచన అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.