మేడ్చల్, శామీర్‌పేటలకు రెండు కారిడార్లుగా పొడిగించాలని నిర్ణయం
- 3 నెలల్లో డీపీఆర్‌లు సిద్ధం చేయడంతో పాటు..
- ఎంపీ ఈటల సూచనలు తీసుకోవాలని సీఎం ఆదేశం
- వివరాలు వెల్లడించిన హెచ్‌ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 1 (విజయక్రాంతి): హైదరాబాద్ ఉత్తరభాగం వాసుల మెట్రో రైల్ కల నెరవేరబోతోంది. నూతన సంవత్సర కానుకగా సీఎం రేవంత్ రెడ్డి మరో రెండు మెట్రో కారిడార్లకు డీపీఆర్‌ల తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్యారడైజ్ మేడ్చల్ - 23 కిలోమీటర్లు, జేబీఎస్--శామీర్ పేట్ 22 కిలోమీటర్లకు వెంటనే డీపీఆర్‌లను సిద్ధంచేసి మెట్రో రైల్ ఫేజ్-2 ‘బి’ భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించాల్సిందిగా హెచ్‌ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
తనతో, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్‌తో ఈ రెండు కారిడార్లకు డీపీఆర్ తయారీ విషయంలో ముఖ్యమంత్రి బుధవారం చర్చించి కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం రెడ్, బ్లూ, గ్రీన్ కారిడార్లలో 69 కిలోమీటర్లలో సేవలు అందిస్తుంది. ఇటీవల మరో ఆరు కారిడార్ల నిర్మాణం కోసం డీపీఆర్‌లను సిద్ధంచేసి రాష్ర్ట ప్రభు త్వ ఆమోదంతో కేంద్రానికి పంపించింది. కాగా బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సూచించిన రెండు కారిడార్లు.. ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి తాడ్‌బండ్, బోయినపల్లి, సుచిత్ర సర్కి ల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్‌కు 23 కిలోమీటర్ల కారిడార్ ఉండనుంది.
జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, ఆల్వాల్, బొల్లారం, హకింపేట్, తూంకుంట, ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్‌పేట్‌కు 22 కిలోమీటర్ల పొడవునా మరో కారిడార్‌ను విస్తరించాలని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సీఎంకు వివరించారు.
గత మల్కాజిగిరి ఎంపీగా ఈ ప్రాంతంలోని ట్రాఫిక్ సమస్యలు, ఈ కారిడార్‌ల రూట్ మ్యాప్‌పై తనకు మంచి అవగాహన ఉన్నట్టు సీఎం చెప్పినట్టుగా పేర్కొన్నారు. అయినా కూడా రూట్ మ్యాప్ విషయంలో ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు వివరించి సూచనలు, సలహాలు తీసుకోవలసిందిగా సీఎం ఆదేశించినట్టుగా మెట్రో ఎండీ వివరించారు.
3 నెలల్లో డీపీఆర్ సిద్ధం చేయాలి
హైదరాబాద్ నార్త్ సిటీకి మెట్రో విస్తరణ డీపీఆర్‌ల తయారీని 3 నెల ల్లో పూర్తి చేసి రాష్ర్ట ప్రభుత్వ అనుమ తి తీసుకోవాలని సీఎం సూచించారు. మెట్రో ఫేజ్-2 ‘ఏ’ భాగం లాగే ‘బీ’ భాగాన్ని కూడా కేంద్ర-, రాష్ర్ట ప్రభుత్వా ల జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా రూపొందించాలని సీఎం ఆదేశించారు.
ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభు త్వ అనుమతికి పంపించాలని ముఖ్యమం త్రి ఆదేశించారని, ఈ మేరకు వెంటనే డీపీఆర్, ఇతర అనుబంధ డాక్యుమెంట్‌ల తయారీ చేపడుతున్నట్టు హెచ్‌ఏ ఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.