- సంగెం నుంచి బీబీనగర్ వరకు 6 కి.మీ. మేర
- నిర్వాసితుల ఇబ్బందులు తెలుసుకోనున్న సీఎం
హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): మూసీ నిర్వాసితులతో స్వయంగా మాట్లాడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిశ్చయించుకున్నారు. ఈ మేరకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 8న సీఎం జన్మదినం సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా యాదగిరిగుట్టకు వెళ్లి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు.
అనంతరం రోడ్డుమార్గం ద్వారా వలిగొండ మండలం సంగెం గ్రామానికి చేరుకుంటారు. అక్కడి నుంచి పాదయాత్రగా సుమారు ఆరుకిలోమీటర్లు నడిచి బీబీనగర్ చేరుకో నున్నారు. సీఎం మార్గమధ్యంలో రైతులు, నిర్వాసితులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు గులాబీ పార్టీ ఎత్తుగడలు వేస్తున్నది. ‘గ్రేటర్’తో పాటు నల్లగొండ జిల్లాకు చెందిన నిర్వాసితులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నది. మరోవైపు బీజేపీ సైతం సర్కార్‌పై విమర్శలు ఎక్కుపెడుతున్నది.
ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రజల మధ్యకు వచ్చి పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. రెండు పార్టీలకు కౌంటర్ ఇవ్వాలని సీఎం భావిస్తున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మూసీ ప్రక్షాళన ఆగదని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే అనేకసార్లు స్పష్టం చేశారు.
సీఎం వాదన ఇదీ..
వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టిన మూసి సూర్యాపేట జిల్లా వాడపల్లి వద్ద కృష్ణాలో కలుస్తుంది. నది ప్రయాణంలో హైదరాబాద్ చేరుకునే సరికి జలాలు కలుషితమవుతాయి. ఫ్యాక్టరీలతో పాటు నగర నలుమూలల నుంచి వ్యర్థాలు నదిలో కలుస్తాయి. కాలుష్యం కారణంగా కనీసం పరీవాహకంలో కనీసం పంటలైనా పండని దుస్థితి.
ఇవే అంశాలను సీఎం రేవంత్‌రెడ్డి అనేకసార్లు పలు సభల్లో ప్రస్తావించారు. మూసీ పునరుద్ధరణ తర్వాత మల్లన్నసాగర్ నుంచి జలాలను తీసుకొచ్చి మూసీలో పారించాలనేది తమ లక్ష్యంగా ప్రకటించారు. వీటన్నింటినీ ప్రజలకు విడమర్చి చెప్పేందుకు సీఎం సిద్ధమయ్యారు. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఇవాళో రేపో అధికారికంగా విడుదల కానున్నది.