- మంత్రులతో కలిసివచ్చిన సీఎంకు పూర్ణకుంభ స్వాగతం
- అమ్మవారిని దర్శించుకున్న తొలి ముఖ్యమంత్రి
మెదక్, డిసెంబర్ 25(విజయకాంత్రి)/పాపన్నపేట: తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం గా విరాజిల్లుతున్న ఏడుపాయల వనదుర్గామాతను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దర్శిం చుకున్నారు. ఆలయ చరిత్రలో ఇప్పటివరకు ముఖ్యమంత్రి హోదాలో అమ్మవారిని దర్శించుకున్న తొలి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు.
బుధవారం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సానిపల్లిలోని వనదుర్గామాత ఆలయం వద్దకు సీఎం.. మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పీసీసీ అధ్య క్షుడు మహేశ్‌కుమార్‌తో కలిసి వచ్చారు. వారిని అధికారులు, ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతంతో ఆలయంలోకి తీసుకెళ్ళారు.
వనదుర్గామాతకు పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్య మంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మండపంలో అమ్మవారి ప్రతిమతో కూడిన జ్ఞాపికను అందజేసి ప్రత్యేక ఆశీర్వచనాలు ఇచ్చారు.
అంతకుముందు ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్, జహీరాబాద్ ఎంపీ సురేష్‌షెట్కార్, మెదక్ ఎమ్మెల్యే రోహిత్‌రావు, నారాయణఖేడ్ ఎమ్మె ల్యే సంజీవరెడ్డి, జూకల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు.
నిధులు కేటాయించండి: ఎమ్మెల్యే రోహిత్‌రావు
మండలంలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి నిధులను మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే రోహిత్‌రావు కోరారు. ఆలయ అభివృద్ధితో పాటు స్నానఘట్టాలు, మురుగు కాలువలు, మురుగుదొడ్ల నిర్మాణాలు, భక్తుల రద్దీకి అనుగునంగా సత్రాల నిర్మాణం, నదీపాయను సిమెంట్‌లో ఆధునీకరించడం, ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు నిధులు విడుదల చేయాలని కోరారు.
అలాగే మండల పరిధిలోని పలు గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులతో పాటు శిథిలావస్థలో ఉన్న పాపన్నపేట మండల వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయం నిర్మాణంతో పాటు, పీహెచ్‌సీని అప్‌గ్రేడ్ చేయడంతో పాటు నూతన భవన నిర్మాణం చేయాలన్నారు. వీటితో పాటు పాపన్నపేట మరియు నాగిరెడ్డి పేట మండలాలను కలిపే బ్రిడ్జికి అప్రోచ్ రోడ్డు నిర్మాణాని నిధులు మంజూరు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి, కాంగ్రెస్‌పార్టీ నాయకులు డీసీసీ అధ్యక్షుడు అంజనేయులు గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు చిలుముల మదన్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, శ్రవణ్‌కుమార్‌రెడ్డి, నీలం మధు, నర్సాపూర్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల కాంగ్రెస్ ఇంచార్జీలు ఆవుల రాజిరెడ్డి, చెరకు శ్రీనివాస్‌రెడ్డి, పూజల హరిక్రిష్ణ, ప్రశాంత్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు గోవింద్‌నాయక్, నాయకులు భూమయ్య, రమేశ్‌గౌడ్‌తో పాటు మండల నాయకులు పాల్గొన్నారు.
292 కోట్ల పనులకు శంకుస్థాపనలు
మెదక్ జిల్లాలో 292 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏడుపాయల వద్ద శంకుస్థాపన చేశారు. ఆలయ ఆభివృద్ధిలో భాగంగా మెదక్ బొడ్మట్‌పల్లి రోడ్డు నుంచి ఏడుపాయల దేవస్థానం వరకు 7 కి.మీ మేర ఉన్న రహదారిని విస్తరించడంతో పాటు డివైడర్, హైమాస్ట్ లైట్ల ఏర్పాటు కోసం 35 కోట్ల రూపాయలను కేటాయించారు.
రామాయంపేటలో ఏర్పాటుచేయబోయే యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ పాఠశాల నిర్మాణానికి 200 కోట్లు, ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా గిరిజన తండాలలో చేపట్టబోయే బీటీ రోడ్డు నిర్మాణాల కోసం 52.76 కోట్లు, జిల్లా కేంద్రంలో 5 కోట్ల రూపాయలతో నిర్మించే స్త్రీ శక్తి భవనాలకు మంత్రులు, ఎంపీలతో కలిసి సీఎం శంకుస్థాపనలు చేశారు.
అలాగే బ్యాంకు లింకేజీ కార్యక్రమం కింద జిల్లాలోని 886 స్వయం సహాయక సంఘాలకు 102.37 కోట్ల రూపాయల చెక్కును ఆ సంఘాల ప్రతినిధులకు అందజేశారు.