15-03-2025 09:07:17 PM
మంత్రిగా ఎమ్మెల్సీలుగా ఎవరికి అవకాశం ఇవ్వలేదు..
కాంగ్రెస్ వచ్చాక నీటి సమస్య.. లో ఓల్టేజి సమస్య మొదలు..
ఇఫ్తార్ విందులో మాజీమంత్రి హరీశ్ రావు...
పటాన్ చెరు: మైనారిటీల అభివృద్ధిని సీఎం రేవంత్ రెడ్డి పక్కన పడేశారని మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) విమర్శించారు. ముస్లింల కోసం బడ్జెట్లో కేటాయించిన రూ.3వేల కోట్లలో కనీసం వెయ్యి కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. తెల్లాపూర్ లో ముస్లింలకు బీఆర్ఎస్ జిల్లా నేత సోమిరెడ్డి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు(Iftar Dinner)లో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రంజాన్ సందర్భంగా ముస్లింలకు కేసీఆర్ ఇచ్చిన తోఫాలను కూడా ఈ ప్రభుత్వం కొనసాగించడం లేదని విమర్శించారు. మోడీని పొగుడుతూ రేవంత్ రెడ్డి తన అసలు స్వరూపాన్ని బయట పెట్టుకున్నారని అన్నారు.
తెల్లాపూర్ మున్సిపల్ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం 75 కోట్లు మంజూరు చేస్తే అందులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 50 కోట్లను రద్దు చేసిందన్నారు. వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పనులను మధ్యలోనే ఆపేసిందన్నారు. ఫంక్షన్ హాల్ ను ప్రారంభించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెల్లాపూర్ మున్సిపల్ కు 15 రూపాయలు కూడా ఇవ్వలేదని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఈ ప్రాంత ప్రజల తాగునీటి సమస్యను తీరిస్తే కాంగ్రెస్ వచ్చాక నీటి సమస్యలో ఓల్టేజ్ సమస్యలు మొదలయ్యాయని అన్నారు. అంతకు ముందు తెల్లాపూర్ ఫంక్షన్ హాల్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, చింత ప్రభాకర్, నాయకులు చంటి క్రాంతి కిరణ్, రసమయి బాలకిషన్, గువ్వల బాలరాజు, మెట్టు కుమార్ యాదవ్, ఆదర్శ్ రెడ్డి, బాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, అంజయ్య యాదవ్, గడీల శ్రీకాంత్ రెడ్డి, మెరాజ్ ఖాన్, ముస్లింలు పాల్గొన్నారు.