17-04-2025 01:53:57 AM
ఇండియా జస్టిస్ రిపోర్టులో వెల్లడి
హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): అత్యుత్తమ పనితీరులో తెలంగాణ పోలీసు శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పోలీస్ శాఖకు ‘ఎక్స్’ వేదికగా అభినందనలు తెలిపారు. ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న 18 రాష్ట్రాల పోలీసింగ్ విషయంలో తెలంగాణ పోలీసు శాఖ మొదటి స్థానంలో నిలిచిందని బుధవారం ట్వీట్ చేశారు.
టాటా ట్రస్ట్, సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్ వంటి ప్రఖ్యాత సంస్థలు రూపొందించిన ఈ నివేదికలో తెలంగాణకు గుర్తింపు దక్కడం రాష్ర్ట పోలీసుల కృషికి దక్కిన గౌరవమని, రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని తెలిపారు.
శాంతిభద్రతలు కాపాడడం, నేరాలను నియంత్రించడం, నేరస్థు లపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసుల నమోదులో పారదర్శకత చూపడం ద్వారా తెలంగాణ పోలీసులు రాష్ర్టంలో శాంతి, న్యాయం నిలబెట్టడంలో విజయవంతమయ్యారని పేర్కొన్నారు.
రాజీలేని కర్తవ్య నిర్వహణతో పోలీసులు ప్రజల్లో నమ్మకాన్ని పెంచారని, ప్రజా పాలనలో ఈ విజయం పోలీసు శాఖ సమష్టి కృషి ఫలితమని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో రాష్ట్ర పోలీసు శాఖ ఇలాంటి విజయాలు మరిన్ని అందుకోవాలని రేవంత్ ఆకాంక్షించారు.