calender_icon.png 5 January, 2025 | 8:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దీప్తి జీవాంజికి సీఎం రేవంత్ అభినందన

03-01-2025 01:46:57 AM

* అర్జున అవార్డుకు ఎంపిక కావడంపై హర్షం 

* మంత్రి సురేఖ, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ప్రశంసలు

హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాం తి): పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకం సాధించి పెట్టిన తెలంగాణ యువ అథ్లెట్, వరంగల్ జిల్లా వాసి దీప్తి జీవాంజి క్రీడల్లో విశిష్ట పురస్కారమైన అర్జున అవార్డు వరించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ‘ఎక్స్’ వేదికగా దీప్తికి అభి నందనలు తెలిపారు.

తమ ప్రభుత్వం అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో సత్తా చాటే యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్నారు. స్పో ర్ట్స్ పాలసీలో భాగంగా ఇప్పటికే దీప్తికి గ్రూప్ స్థాయి ఉద్యోగంతో పాటు రూ.కోటి ప్రోత్సాహకం, వరంగల్‌లో 500 గజాల స్థలం, కోచ్ నాగపురి రమేశ్‌కు రూ. 10 లక్షల నగదు బహుమతి అందజేశామని గుర్తుచేశారు.

యువ క్రీడాకారులు క్రీడల్లో రాణించి తెలంగాణకు కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ, స్పోర్ట్స్ కాంప్లెక్సులు అందుబాటులోకి తెస్తామన్నారు. అలాగే ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైన గుకేశ్ (చెస్), హర్మన్ ప్రీత్ (హాకీ), ప్రవీణ్ కుమార్ (పారా అథ్లెటిక్స్), మనుబాకర్ (షూటింగ్)కు కూడా సీఎం అభినంద నలు తెలిపారు.

విశ్వ వేదికపై భారత కీర్తి దీప్తి: కేటీఆర్

విశ్వవేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగుర వేసి భారత్ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పి ఖేల్త్న్ర, అర్జున అవార్డులకు ఎంపికైన క్రీడాకారులకు అభినందనలు తెలుపుతున్నట్లు మాజీ మంత్రి కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. తెలంగాణ బిడ్డ పారా అథ్లెట్ దీప్తి జీవాంజికి అర్జున అవార్డు దక్కడం ఆనందాన్నిచ్చిందన్నారు.

ఓరుగల్లు ముద్దుబిడ్డ దీప్తి: మంత్రి కొండా సురేఖ

ఓరుగల్లు ముద్దుబిడ్డ దీప్తి జీవాంజి పారిస్‌లో పారా ఒలింపిక్స్‌లో పరుగు పందెంలో కాంస్య పతకం సాధించిదేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిందని, ఇప్పుడు అర్జున అవార్డు దక్కించుకున్నదని మంత్రి కొండా సురేఖ హర్షం వ్యక్తం చేశారు.

దీప్తి మానసిక సామర్థ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ, కుంగిపోకుండా, విధిని ఎదిరించి క్రీడల్లో రాణిస్తున్నదన్నారు. దీప్తి జీవాంజి ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆమెకు తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. దీప్తి మరెన్నో కీర్తి శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.