calender_icon.png 9 November, 2024 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్.. యాక్టింగ్ సీఎం కేటీఆర్

09-11-2024 12:00:00 AM

  1. పగలు ఫైట్ చేస్తరు.. రాత్రి కలిసిపోతరు
  2. సీఎం పాదయాత్ర సంగెం వద్ద కాదు.. మూసీ బాధితులు ఉండే ప్రాంతాల్లో చేయాలి
  3. బీఆర్‌ఎస్ పనైపోయింది.. ఎమ్మెల్సీ ఎన్నికకు అభ్యర్థే దొరకడం లేదు
  4. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కాగా, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యాక్టింగ్ సీఎంగా వ్యవహరిస్తున్నారని కేంద్ర హోం సహాయశాఖ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. వారిద్దరూ పగలంతా ఫైట్ చేసుకుని, రాత్రి కలిసిపోతరన్నారు.

హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలపై హాట్ కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టున నిందితులు నాటి సీఎం కేసీఆర్ చెప్తేనే ఆ పని చేశామని చెప్పారని, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయని అయినప్పటికీ అరెస్ట్‌లు లేవన్నారు.

మాజీ మంత్రి కేటీఆర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి రాజీ పడ్డారని, అందుకే ఈ ఫార్ములా రేస్, రేవ్ పార్టీ, డ్రగ్స్, కాళేశ్వరం ప్రాజెక్ట్ సహా అన్ని స్కాంల్లో కేటీఆరే ప్రధాన నిందితుడేనని తేలినా, రాష్ట్రప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నదని ఆరోపించారు.

జన్వాడ ఫాంహౌజ్‌పై డ్రోన్ వెళ్లిందనే కారణంతో బిడ్డ పెళ్లిని కూడా చూడనీయకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన విషయాన్ని రేవంత్‌రెడ్డి మరచిపోయారన్నారు. కేటీఆర్ యాక్టింగ్ సీఎం కాబట్టే జన్వాడ బావమరిది ఫాంహౌజ్ కేసులో అడ్డంగా దొరికిన విజయ్ మద్దూరి, రాజ్ పాకాలపై నామ్ కే వాస్తే కేసులు పెట్టి వదిలేశారని ఆరోపించారు. ఫాం హౌస్ పార్టీలో కేటీఆర్ సైతం ఉన్నాడని మీడియా కోడై కూసినా సర్కార్ పట్టించుకోలేదని ఆరోపించారు.

బీఆర్‌ఎస్ కార్యకర్తలపై ఎవైనా కేసులైతే పోలీసులకు ఫోన్ చేయని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, తన కొడుకు కేటీఆర్ బావమరిది కేసు గురించి మాత్రం ఏకంగా డీజీపీకి ఫోన్ చేశారన్నారు. కేసీఆర్‌కు కార్యకర్తలకంటే కుటుంబమే ముఖ్యమన్నారు. అందుకే బీఆర్‌ఎస్ గురించి ఆలోచించే కార్యకర్తలే కరువయ్యారన్నారు.

అందుకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు సైతం దొరకడం లేదని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎప్పటినుంచో పక్కచూపులు చూస్తున్నారన్నారు. ప్రజల సమస్యలు, కార్యకర్తలు, పార్టీని గాలికొదిలేసి కేసీఆర్ హాయిగా ఫాంహౌజ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారని దుయ్యబ ట్టారు.

రాష్ట్రంలో ఇక బీఆర్‌ఎస్ పనైపోయిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సంగెంవద్ద కాకుండా, మూసీ బాధిత ప్రాంతాల్లో పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు. తాను స్వయంగా ఆయా ప్రాంతాల్లో పర్యటించానని, బాధితుల బాధలు కళ్లారా చూసి చలించిపోయానన్నారు. ప్రధానమంత్రి మోదీకి కనీసం గౌరవం ఇవ్వకుండా సీఎం రేవంత్ నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

సీఎం తన వైఖరి మార్చుకోకపోతే మాజీ మంత్రి కేటీఆర్‌కు నెత్తికెక్కిన కళ్లను కిందికి దించినట్లుగానే దించుతామని హెచ్చరించారు. కేటీఆర్‌లా తాను తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదన్నారు. కేటీఆర్‌తో పోలిస్తే అంతో ఇంతో నిబద్ధత ఉన్న నేత హరీశ్‌రావు అని కితాబునిచ్చారు.