ఆపత్కాలంలో పేదప్రజలకు వైద్య సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఎం సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) రాష్ట్రంలో అక్రమార్కులకు బంగారు గనిగా మారింది. ఆస్పత్రుల్లో చికిత్సలు చేయకుండానే నకిలీ బిల్లులు సష్టించి కోట్ల రూపాయలు ప్రభుత్వా నికి టోకరా పెట్టారు. తాజాగా సీఐడి ఈ వ్యవహారంపై కేసు నమోదు చే యడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.ముఖ్యమంత్రి సహాయనిధి నిధులను దొంగబిల్లులతో దోపిడీ చేశారని గుర్తించిన సీఐడి రాష్ట్రవ్యాప్తంగా 28 ఆస్పత్రులపై కేసులు నమోదు చేసింది. ఈ జాబితాలో హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రులతో పాటుగా ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్, మిర్యాలగూడ తదితర పట్టణాల్లోని ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి.
రాష్ట్ర సెక్రటేరియట్‌లో సీఎం రిలీఫ్‌ఫండ్ విభాగానికి చెందిన ఓ సెక్షన్ ఆఫీసర్ చేసిన ఫిర్యాదుతో సీఐడీ జరిపిన ప్రాథమిక దర్యాప్తులో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఏ ఆస్పత్రి ఎవరిపేరు మీద ఎంతమొత్తాన్ని దొంగబిల్లులతో స్వాహా చేసిందో ఈ దర్యాప్తులో బయటపడింది.రోగులకు వైద్యం అందించినట్లు దొంగ కేస్ షీట్లు, బిల్లులను సృష్టించి కోట్లాది రూపాయలు ప్రభుత్వ సొమ్ము దోచుకున్నట్లు తెలు స్తోంది. భారీ ఎత్తున చోటు చేసుకున్న ఈ స్కామ్‌లో ఆస్పత్రుల సిబ్బందితో పాటు కొంతమంది ప్రజాప్రతినిధుల వద్ద పని చేసిన ఉద్యోగులు, మధ్యదళారీల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ కుంభకోణం గత ఏడాది ఏప్రిల్‌కు ముందే బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగినట్లు అభియోగాలు వచ్చాయి.
దీంతో సెక్షన్ ఆఫీసర్ బీఆర్ మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత సీఐడీ రంగంలోకి దిగి విచారణ చేపట్టిం ది. ముఖ్యమంత్రి సహాయనిధి ఫండ్స్‌ను అడ్డగోలుగా దోపిడీ చేసినట్లు సీఐడీ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయింది. ఇలా దోచుకున్న ఆస్పత్రుల్లో ఖమ్మం జిల్లా ప్రథమస్థానంలో ఉండగా హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన హరీశ్‌రావు వద్ద డాటా ఆపరేటర్‌గా పని చేసిన వ్యక్తిపైనా కేసు నమోదయింది. కాగా ఈ కుంభకోణం అన్ని చోట్లా దాదాపుగా ఒకే విధంగా జర గడం గమనార్హం.
రోగులను ఆస్పత్రుల్లో చేర్చుకోకుండానే చికిత్స చేసినట్లుగా తప్పుడు కేస్ షీట్లు, బిల్లులు సృష్టించి ముఖ్యమంత్రి కార్యాలయాని కి పంపించి వచ్చిన సొమ్ములు స్వాహా చేశారని తేలింది. అయితే ఈ కుం భకోణంలో గతంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నా యకుల పాత్ర కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొన్ని చోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను భారీ సంఖ్యలో పంపిణీ చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు జరపాలని సీఐడీ నిర్ణయించింది.
నిజానికి సీఎంఆర్‌ఎఫ్ అనేది రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన లేదా ప్రాణాంతక వ్యాధుల చికిత్స అవసరమైన బాధితులకు వైద్య చికిత్సకోసం ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం ఏర్పాటు చేసిన పథకం. ఆస్పత్రుల్లో చేరిన తర్వాత చికిత్స కోసం అయిన ఖర్చుకు సంబంధించిన బిల్లులను స్థానిక ప్రజాప్రతినిధుల సిఫార్సుతో ముఖ్యమంత్రి కా ర్యాలయానికి పంపితే వాటిని పరిశీలించాక ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తారు.
చికిత్స చేసిన ఆస్పత్రులు ఇచ్చే బిల్లులు, స్థానిక ప్రజాప్రతినిధుల సిఫార్సుల ఆధారంగానే ఈ ఆర్థిక సహాయం మంజూరు అవు తుంది కను క ఇంతకాలం దీనిపై ఎవరూ పెద్దగా దృష్టిపెట్టలేదు. అయితే రానురాను ఇది ప్రైవేటు స్పత్రులు, మధ్య దళారీలకు పెద్ద వ్యాపారంగా మారింది. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా చూసీ చూడనట్లుగా సిఫార్సులు చేయడం జరిగింది. అయితే బీఆర్‌ఎస్ గద్దె దిగి కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఈ పథకానికి సంబంధించిన బిల్లులు పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉండడంతో తీగలాగితే డొంక కదిలింది.