calender_icon.png 3 October, 2024 | 2:38 PM

బాపూఘాట్ వద్ద మహాత్ముడికి సీఎం నివాళి

03-10-2024 02:31:16 AM

సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్న సీఎం రేవంత్, మంత్రులు

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 2 (విజయక్రాంతి)/ కార్వాన్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని  లంగర్‌హౌజ్‌లోని బాపూఘాట్ వద్ద బుధవారం నిర్వహించిన వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

ఆయనతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహా దారులు కే కేశవరావు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, మేయర్ జీ విజయలక్ష్మి, మాజీ ఎంపీ వీ హనుమంతరావు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం గాంధీ మ్యూజియంలో గాంధీ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో సీఎం, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం వేడుకల్లో పాల్గొన్న వివిధ పాఠశాలల విద్యార్థులతో సీఎం రేవంత్‌రెడ్డి కరచాలనం చేసి కాసేపు ముచ్చటించారు. తర్వాత మహాత్ముడి విగ్రహం ఎదుట హైదరాబాద్ జలమండలి ఆధ్వర్యంలో ముద్రించిన వాల్ పోస్టర్లను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులతో కలిసి ఆవిష్కరించారు. వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతాకుమారి, డీజీపీ డాక్టర్ జితేందర్‌రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జలమండలి  ఎండీ అశోక్‌రెడి, జీహెచ్‌ఎంసీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

గవర్నర్ నివాళి

బాపూఘాట్ వద్ద గాంధీ విగ్రహానికి గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ నివాళి అర్పించారు. ఆయనతో పాటు బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉన్నారు.