21-02-2025 04:06:02 PM
నారాయణపేట,(విజయక్రాంతి): నారాయణపేట జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ వైఖరి వల్ల 8 వైద్య కళాశాలల ఏర్పాటు ప్రశ్నార్థకంగా మరిందని ఆరోపించారు.
మారుమూల ప్రాంతాల్లో మెడికల్ కాలేజీ నిర్మించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 8 వైద్య కళాశాలలు రద్దు కాకుండా కృషి చేసిందని, అవసరమైన వసతులు కల్పించి నిలబెట్టుకున్నామని సీఎం రేవంత్ తెలిపారు. మెడికల్ కాలేజీలకు అవసరమైన అన్ని వసతులు భవిష్యత లోనూ మెరుగైన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. నిత్యం మానవత్వంతో నడుచుకుకోవాల్సిన వృతి.. వైద్యవృతి అని, ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు సేవ చేసేందుకు వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు సూచించారు.
ఇందిరమ్మ ఇళ్లకు సీఎం రేవంత్ శంకుస్థాపన..
అప్పక్ పల్లెలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన సీఎం మహిళా సమాఖ్య పెట్రోల్ బంకు ప్రారంభించారు. నారాయణపేట ప్రభుత్వ వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాలలో భవనాలకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.130 కోట్లతో వైద్య కళాశాల, హాస్టల్ నిర్మాణం, రూ.26 కోట్లతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణం చేపట్టానున్నారు. అలాగే నారాయణపేటలో రూ.40 కోట్లతో వంద పడకల యూనిట్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం వైద్య విద్యార్థులతో ముఖ్యమంత్రి సంభాషించారు.