- శాంతి భద్రతలపై విపక్షాల విమర్శలు
- పోలీసు నియామక ప్రక్రియకు సీఎం ఆదేశం
పాట్న, అక్టోబర్ 21: సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి డీజీపీకి తన రెండు చేతులూ జోడించి అభ్యర్థించిన ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కొత్తగా ఎంపికైన 1,239 మంది పోలీసు అధికారులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో తాజాగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీస్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేస్తారా అని చేతులు జోడించి మరీ ఆ రాష్ట్ర డీజీపీ అలోక్‌రాజ్‌ను అడిగారు. సీఎం చేసిన పనికి ఒక్కసారిగా షాకైన డీజీపీ వెంటనే సీఎం నితీశ్ కుమార్‌కు సెల్యూట్ చేసి, మైక్ వద్దకు వెళ్లి మాట్లాడారు.
సీఎం ఆదేశాలు అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. త్వరితగతిన నియామకపూర్తి చేసి, ఎంపికైన అభ్యర్థులకు పటిష్టమైన శిక్షణ అందిస్తామన్నారు. దీంతో డీజీపీకి సీఎం నితీశ్ కుమార్ థాంక్స్ చెప్పారు.
వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిహార్‌లో నెలకొన్న శాంతి భద్రతలపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో ప్రస్తుతం బిహార్‌లో 1.10లక్షల మంది పోలీసులు ఉండగా.. ఆ సంఖ్యను 2.29లక్షలకు పెంచాలని నితీశ్ కుమార్ ప్రభుత్వం భావించి అందుకు కావాల్సిన చర్యలు తీసుకుంది.