calender_icon.png 2 October, 2024 | 9:59 AM

ఖర్గేతో సీఎం భేటీ

02-10-2024 03:02:51 AM

కేసీ వేణుగోపాల్‌తోనూ రేవంత్ సమావేశం

తెలంగాణలోని తాజా రాజకీయాలు హైడ్రా, మూసీ సుందరీకరణపై వివరణ 

మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ  

హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయ్యారు. సోమవారం రాత్రి హస్తినకు వెళ్లిన సీఎం.. మంగళవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో వేర్వేరుగా సమావేశం అయ్యారు.

రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై వారికి సీఎం వివరించినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసిన హైడ్రా, మూసీ నదీ సుందరీకరణ గురించి వివరించినట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కులగణన చేయాలని తీసుకున్న నిర్ణయంపై కూడా చర్చించారని తెలిసింది.

మం త్రివర్గ విస్తరణ, మిగిలిన నామినేటెడ్ పదవుల భర్తీపైనా ప్రధానంగా చర్చించారు. వీటితోపాటు హర్యానా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అంశంపైన చర్చ జరిగినట్టు పార్టీ వర్గాల సమాచారం. కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ చీఫ్ ఖర్గే అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఖర్గేను రేవంత్‌రెడ్డి పరామర్శించారు. ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌కు తిరిగొచ్చారు.