calender_icon.png 19 January, 2025 | 5:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగపూర్ మంత్రితో సీఎం భేటీ

19-01-2025 12:35:56 AM

పలు ప్రాజెక్టుల్లో కలిసి పనిచేసేందుకు పరస్పర అంగీకారం

హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): సింగపూర్ వాణిజ్య, పర్యావరణ మంత్రి గ్రేస్ ఫు హై యిన్‌తో  సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రి శ్రీధర్‌బాబుతో కూడిన తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం శనివారం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. తెలంగాణతో వివిధ రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యంపై ప్రధానంగా దృష్టి సారించారు.

తెలంగాణలో నగరాలు, పట్టణాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, నీటి వనరుల నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, స్పోర్ట్స్, సెమీ కండక్టర్ల తయారీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు.

తెలంగాణ ప్రభుత్వానికి సహకారం అందించేందుకు ఈ సందర్భంగా సింగపూర్ మంత్రి గ్రేస్ పు హైయిన్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రైజింగ్ లక్ష్య సాధనలో భాగంగా రాష్ర్ట ప్రభుత్వంతో భాగస్వామ్యం కావాలన్న ఆహ్వానాన్ని పరిశీలిస్తామన్నారు. ప్రధానంగా ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్, నీటి వనరుల నిర్వహణ, తెలంగాణ ఎంచుకున్న సుస్థిర వృద్ధి  ప్రణాళికలపై కలిసి పనిచేసేందుకు పరస్పర అంగీకారం కుదిరింది.

ఈ సందర్భంగా ఉమ్మడిగా చేపట్టాల్సిన ప్రాజెక్టులు, వాటిపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక బృందాలను గుర్తించాలని నిర్ణయించారు. వివిధ రంగాల్లో సింగపూర్ అనుభవాలను పంచుకోవాలని, భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న తెలంగాణలో సంయుక్తంగా చేపట్టే ప్రాజెక్టుల కార్యాచరణ వేగవంతం చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు.

బీజిబీజీగా తెలంగాణ బృందం

సింగపూర్‌లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ బృందం పర్యటన బీజిబీజీగా సాగింది. ఆదివారం కూడా రాష్ట్ర ఉన్నతస్థాయి బృందం సింగపూర్‌లో పర్యటించనుంది. ఆ తర్వాత దోవోస్‌కు బయలుదేరనుంది. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వెంట పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి ఉన్నారు.