- గ్రేటర్‌లో హెచ్‌సీటీ ఫేజ్ 1లో రూ.3446 కోట్ల పనులు
- రూ.150 కోట్లతో జంక్షన్ల సుందరీకరణ
- 669 కోట్లతో చేపట్టిన ఎస్టీపీలు ఓపెనింగ్
- ఓఆర్‌ఆర్ ఫేజ్2లోని 19 రిజర్వాయర్లు ప్రారంభం
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 3 (విజయక్రాంతి): గ్రేటర్ అభివృద్ధిలో భాగంగా రూ.7 వేల కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, జలమండలి ఆధ్వర్యంలో గ్రేటర్, ఓఆర్‌ఆర్ వరకు చేపట్టగా పూర్తయిన పలు పనులను సీఎం ప్రారంభించారు.
ప్రజావిజయోత్సవాలను పురస్కరించుకుని పురపా లక, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హెచ్‌ఎండీఏ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన వేడుకల్లో రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొ న్నారు.
అంతకు ముందు సభాప్రాం గణంలో జలమండలి సిబ్బందికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు తదితరులు భద్రత (పీఈ కిట్స్) పరికరాలను అందజేశారు. జీహెచ్‌ంసీ సిబ్బందికి ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించి కార్మికులతో మాట్లాడారు. వికలాంగులకు ట్రైసైకిళ్లను పంపిణీచేశారు.
ట్రాఫిక్ రద్దీని నియంత్రించేలా..
గ్రేటర్‌లో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు, ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు పలు జంక్షన్లలో రూ.3,446 కోట్లతో గ్రేడ్ సపరేటర్లు, అండర్‌పాసుల నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులను సీఎం ప్రారంభించారు. జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ ఎంట్రీగేటు ఎదుట గల జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, రోడ్ నంబర్ 45, ఫిల్మ్‌నగర్, ఆగ్రాసేన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ల వద్ద రూ.1,090 కోట్లతో ఈ పనులు చేపట్టబోతున్నారు.
రూ.398 కోట్లతో రేతీబౌలి, నానల్ నగర్ జంక్షన్‌లో మల్టీలెవల్ ఫ్లుఓవర్, రూ.837కోట్లతో ఖాజగూడ, ఐఐఐటీ, విప్రో జంక్షన్ల అభివృద్ధి పనులు చేయబోతున్నారు. రూ.45 కోట్లతో అమీన్‌పూర్ నుంచి 65 నేషనల్ హైవేను, రూ.39 కోట్లతో సైబరాబాద్ సీపీ కార్యాలయం నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు రోడ్డును, రూ.31కోట్లతో అంజయ్యనగర్ నుంచి రాంకీ టవర్స్ వరకు రోడ్డును 150 ఫీట్లకు విస్తరించబోతున్నారు.
రూ.210కోట్లతో ఆర్కేపురం ఆర్వోబీ, రూ.35 కోట్లతో ఆర్కేపురం ఆర్యూబీని చేపట్టనున్నారు. రూ.30 కోట్లతో చిలకలగూడ ఆర్యూబీ, రూ.339 కోట్లతో ఒవైసీ ఫ్లుఓవర్‌ను సంతోష్‌నగర్ వరకు పొడగించనున్నారు. రూ.200 కోట్లతో నమేలీ మైలార్‌దేవ్‌పల్లి, శంషాబాద్ రోడ్, కాటేదాన్ జంక్షన్ల అభివృద్ధి, రూ.59 కోట్లతో ఆరాంఘర్ జంక్షన్ వద్ద ఆర్యూబీని నిర్వించనున్నారు.
రూ.11 కోట్లతో అజీమ్ హోటల్ నుంచి చర్చిగేట్ (షోయబ్‌హోటల్ నుంచి బాలాపూర్ రోడ్ వరకు) 80 ఫీట్ల రోడ్డు వెడల్పు, రూ.9 కోట్లతో చాంద్రాయణగుట్ట నుంచి బార్కాస్ వరకు 60 ఫీట్ల రోడ్డు వెడల్పు చేయబోతున్నారు. రూ.57 కోట్లతో లక్కీ స్టార్ హోటల్ నుంచి హఫీజ్ బాబానగర్ వరకు అభివృద్ధి చేస్తారు.
హైదరాబాద్ రోడ్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌ఆర్‌డీసీఎల్) ఆధ్వర్యంలో గ్రేటర్‌లో రూ.1500 కోట్లతో చేపట్టిన రోడ్ల అభివృద్ధి పనులు, గతంలో పెండింగ్‌లో ఉన్న పనులను చేపట్టనున్నారు. గ్రేటర్‌లోని ఫ్లుఓవర్లు, సబ్‌వేలు, పార్కులు, జంక్షన్లలో రూ.150 కోట్లతో చేపట్టిన సుందరీకరణ పనులను ప్రారంభించారు.
వానకాలంలో రోడ్లపై నీళ్లు నిలువకుండా ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా రూ.100 కోట్లతో జీహెచ్‌ఎంసీ పరిధిలో 50 సంపులను నిర్మించబోతున్నారు. వాటిలో రూ.16.47 కోట్లతో 12 చోట్ల నిర్మాణం జరుగుతోంది. పనులు పూర్తయిన 4 సంపులను కూడా సీఎం ప్రారంభించారు.
ఆరు ఎస్టీపీలు.. 19 రిజర్వాయర్లు ప్రారంభం
జలమండలి పరిధిలో రూ.669 కోట్లతో చేపట్టిన 527 ఎంఎల్‌డీల సామర్థ్యం గల ఆరు ఎస్టీపీలను, ఓఆర్‌ఆర్ ఫేజ్ చేపట్టిన 19 రిజర్వా యర్లను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. రూ.301కోట్లతో చాంద్రాయణ గుట్టలో చేపట్టబోయే సీవరేజీ లైన్ పునరుద్ధరణ, అండర్ డ్రైనేజీని నిర్మించబో తున్నారు. జంట జలాశయాల అభివృద్ధికి రూ.82 కోట్లతో చేపట్టనున్న పనులకు సీఎం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో 1650 ఎంఎల్‌డీల మురుగు ఉత్పత్తవుతోంది. ప్రస్తుతం ఉన్న 25 ఎస్టీపీల ద్వారా 772 ఎంఎల్‌డీల మురుగు మాత్రమే శుద్ధి జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.3866 కోట్లతో 31 ఎస్టీపీల నిర్మాణానికి 2021లో పరిపాలన అనుమతు లు ఇచ్చింది.
మూడు ప్యాకేజీల్లో చేపట్టిన ఈ పనుల్లో పూర్తయిన కొన్ని ఎస్టీపీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరో 10 ఎస్టీపీలు ఈ నెలాఖరు వరకు పూర్తికానున్నాయి. గ్రేటర్‌తోపాటు ఓఆర్‌ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలు, పలు మండలాలకు కూడా జలమండలి తాగునీటిని సరఫరా చేస్తోంది.
ఓఆర్‌ఆర్ ఫేజ్ భాగంగా ప్యాకేజీ 1, 2, 3లో రూ.1200 కోట్లతో 138 ఎంఎల్‌డీ సామర్థ్యంతో 71 రిజర్వాయర్ల నిర్మా ణం చేపట్టింది. ఇప్పటికే 61 రిజర్వాయర్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం నిర్మా ణం పూర్తయిన 19 (రూ.188.11కోట్లు) రిజర్వాయర్లను సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు. వీటిలో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 2, పటాన్‌చెరువులో 4, మేడ్చల్‌లో 7, మహేశ్వరంలో 6 ఎస్టీపీలు ఉన్నాయి. మిగతా 10 రిజర్వాయర్లు ఈ నెలాఖరులో పూర్తికానున్నాయి.