ఇష్టానుసారంగా ప్రతిపక్షాల విమర్శలు
నల్లమల్లను టూరిజం హబ్‌గా మారుస్తాం
ఉమామహేశ్వర క్షేత్రంలో మంత్రి కొండా సురేఖ
నాగర్‌కర్నూల్, అక్టోబర్ 7 (విజయక్రాంతి)/అచ్చంపేట: పదేండ్లు తెలంగాణ సంపద ను దోచుకున్న బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు పదవి లేక తహతహలాడుతున్నారని, పాడుబడిన తెలంగాణను సీఎం రేవంత్‌రెడ్డి బాగు చేస్తున్నాడని దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం ఉమామహేశ్వర క్షేత్రంలో నిర్వహించిన పాలకమండలి సమావేశంలో ఆమె మాట్లాడారు.
బీఆర్‌ఎస్ ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. ప్రజల ఆశ్వీర్వాదంతో రోజుకు 18 గంటలు శ్రమిస్తూ తెలంగాణను బాగు పరిచేందుకు సీఎం రేవంత్‌రెడ్డి పని చేస్తున్నారన్నారు. చేతనైతే సలహాలను ఇవ్వాలిగానీ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని హితువు పలికారు.
నల్లమల్లను టూరిజం హబ్‌గా మార్చేందుకు తన వంతు సహాయం ఎల్లప్పుడు ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 40వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని త్వరలో మరో 11 వేల మంది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తుందన్నారు. పాలకమండలి ప్రమాణస్వీకారోత్సవం అనంతరం పలు దేవాలయా లను ఆమె సందర్శించారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
నిధులు కేటాయించాలి: ఎమ్మెల్యే వంశీకృష్ణ
ఉమామహేశ్వర స్వామి క్షేత్రంలో అన్నదాన సత్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రూ.50లక్షలు, కళ్యాణ మండపం కోసం రూ.కోటి, పాత గెస్ట్‌హౌస్ పునరుద్ధరణ కోసం రూ.25లక్షలు, పంచలింగాల నుంచి ఉమామహేశ్వర క్షేత్రానికి శ్రీశైలం హైదరాబాద్ రహదారిపై ఉన్న ప్రతాపరుద్రుని కోట నుంచి ఉమా మహేశ్వరం వరకు 5 కిలో మీ టర్ల రూప్ వే నిర్మాణం రూ.55 కోట్లు కేటాయించాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ మంత్రిని కోరారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఉన్నారు.