ఒక్కరోజే వచ్చి, మళ్లీ కన్నెత్తి చూడలేదు: హరీశ్‌రావు
హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తామని కాంగ్రెస్ అభయహస్తం మ్యానిఫెస్టోలో డబ్బా కొట్టారని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్‌ను జరపకపోగా పేరు మార్చి ప్రజావాణిని చేశారని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ కేవలం ఒకే ఒక్కరోజు హాజరై, 10 నిమిషాల పాటే వినతులు స్వీకరించారని, ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడలేదని శుక్రవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. మంత్రులు అందుబాటులో ఉంటారని మాట మార్చారని, ఆ మాట కూడా నిలబెట్టుకోలేదని ఆరోపించారు. మంత్రులకు గాంధీభవన్‌కు వెళ్లేందుకు ఉన్న తీరిక, ప్రజావాణికి వచ్చేందుకు లేదన్నారు.
ముఖ్య మంత్రి, మంత్రులూ రాకపోవడంతో, చివరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో తూతూ మంత్రంగా ప్రజావాణి నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజావాణికి 2024, డిసెంబర్ 9 నాటికి 82 వేల 955 పిటిషన్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారని, అందులో 43,272 పిటిషన్లు మాత్రమే గ్రీవెన్సెస్ కిందకు వస్తాయని, మిగతావి రావని రావంటున్నారన్నారు.
భూ తగాదాలు, భూ నిర్వాసితుల, నిరుద్యోగుల, వివిధ వర్గాల సమస్యలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు మొదలైన విషయాలు గ్రీవెన్సెస్ కిందకు రావంటూ సగం దరఖా స్తులను అధికారులు తిరస్కరిస్తున్నారని మండిపడ్డారు. వీటిలో 27,215 మాత్రమే పరిష్కరించారని అధికారులు చెప్పారన్నారు.
చాలా సమస్యలను పరిష్కరించకుండానే దరఖాస్తులను పక్కన పెట్టారని ఆరోపించారు. ప్రజావాణిలో తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఎంతో ఆశతో వ్యయ ప్రయాసలకోర్చి హైదరాబాద్ వరకు వస్తే, వారి ఆశలు అడియాసలవుతున్నాయని మండిపడ్డారు.