హెచ్‌సీయూ మైదానంలో పరుగులు
ఉత్సాహంగా గోల్స్ చేసిన రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): కొన్ని రోజులుగా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఉత్సాహంగా ఫుట్‌బాల్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. పార్టీల గెలుపోటములపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న వేళ ఆయన ఆటవిడుపుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ఆడారు. విద్యార్థులతో కలిసి మైదానంలో పరుగులు తీశారు. ఆట మధ్యలో షూ పాడవటంతో షూస్ లేకుండానే ఆటలో మునిగితేలారు. విద్యార్థులతో పోటీపడుతూ ఉత్సాహంగా గోల్స్ చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, టీఎంఆర్‌ఐఈఎస్ ప్రెసిడెంట్ ఫహీం ఖురేషీ, హెచ్‌సీయూ ఎన్‌ఎస్‌యూఐ యూనిట్, హెచ్‌సీయూ విద్యార్థులూ ఆటలో భాగమయ్యారు. ఈ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు సీఎం సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు హర్కర్ వేణుగోపాల్, టీశాట్ సీఈఓ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఇది కూడా ప్రచారమే: క్రిశాంక్
ఎన్నికల వరకు ప్రచారంలో పాల్గొనకూడదని నిబంధనలు ఉన్నా.. రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ఆడటం సరికాదని బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఇండియా టీంకు ప్లేయర్ కాదని, అటువంటప్పుడు ఇండియా టీం జెర్సీని ఎందుకు ధరించారని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత కూడా కాంగ్రెస్ ప్రచారం చేస్తూ అందరినీ ఫూల్స్ చేస్తున్నారని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.