calender_icon.png 14 October, 2024 | 5:53 AM

స్వగ్రామంలో సీఎం దసరా వేడుకలు

14-10-2024 03:15:30 AM

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కొండారెడ్డిపల్లిలో పర్యటించిన రేవంత్‌రెడ్డి

  1. మాడల్ పంచాయతీ ప్రారంభోత్సవం 
  2. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన 
  3. ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 13 (విజయక్రాంతి)/కల్వకుర్తి/కొడంగల్: తన స్వగ్రా మం కొండారెడ్డిపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దసరా వేడుకల్లో పాల్గొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో శనివారం దసరా పర్వదినాన గ్రామ అబివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

తొలిసారి గ్రామానికి వచ్చిన రేవంత్‌రెడ్డికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. కుటుం బసభ్యులు, బంధువులు, పార్టీ నాయకులు, గ్రామస్థులతో కలిసి సాదాసీదాగా గడిపారు. దీంతోపాటు తమ ఊరు రాష్ట్రంలోనే మోడల్ గ్రామంగా ఎదుగుతుండటంతో గ్రామస్థుల ఆనందానికి అవదులు లేకుండాపోయాయి.

గ్రామంలోని గుడి, బడి, గ్రంథాలయం, బస్‌స్టే షన్, పాలశీతలీకరణ కేంద్రం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు, చివరికి సోలార్ విద్యుత్ దీపాలు, సోలార్ ఉచిత పంపుసెట్లు.. ఇలా సకల సౌలత్‌లు ఒకేసారి రావడంతో సంబురపడ్డారు. తమ గ్రామస్థుడైన రేవంత్‌రెడ్డి సీఎం హోదాలో రావడంతో గ్రామస్థులు ఉత్సాహంతో పండగను జరుపుకొన్నారు. 

మాడల్ గ్రామంగా కొండారెడ్డిపల్లి

రాష్ట్రంలోనే కొండారెడ్డిపల్లిని మాడల్ గ్రామంగా తీర్చిదిద్దేలా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. శనివారం రేవంత్ రెడ్డి చేతులమీదుగా అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.45 లక్షలతో నిర్మించిన పశువైద్యశాల, రూ.58 లక్షలతో బీసీ కమ్యూనిటీ భవనం, రూ. 55 లక్షలతో యాదయ్య స్వారక గ్రంథాలయం, రూ.72 లక్షలతో గ్రామపంచాయతీ భవనాన్ని ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.

కమ్యూనిటీ భవనం, రూ.18 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం, రూ.64 లక్షలతో బస్‌స్టేషన్, రూ.32 లక్షలతో చిల్డ్రన్స్ పార్క్, ఓపెన్ జిమ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు గ్రామంలో మొక్కలు నాటారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. 

కొడంగల్‌లో సందడి

సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌కు రావడంతో పట్టణంలో సందడి నెలకొంది. సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లి పర్యటన ముగించుకొని శనివారం రాత్రి కొడంగల్ చేరుకున్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణ సీఎంకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఆదివారం సీఎం స్వగృహంలో నియోజకవర్గ ప్రజలు భారీ సంఖ్యలో రేవంత్‌రెడ్డిని కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరిని రేవంత్‌రెడ్డి ఆప్యాయతగా పలకరించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్‌రెడ్డి పాల్గొన్నారు.