రేపు పాలమూరుకు రేవంత్‌రెడ్డి
వారానికో జిల్లా వెళ్లేందుకు కార్యాచరణ
సాగునీటి ప్రాజెక్టులు, విద్యా, వైద్యం అంశాలపై సమీక్ష
హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. వారానికి ఒక జిల్లాకు వెళ్లేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఈ మేరకు సొంత జిల్లా మహబూబ్‌నగర్ నుంచే టూర్‌కు శ్రీకారం చూట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఈ నెల 9న పాలమూరు జిల్లాలో రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. పర్యటన సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ప్రధానంగా జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యంతోపాటు ఇతర అంశాలపై సీఎం రివ్యూ చేయనున్నారు. కాగా ఇటీవలే సచివాలయంలో అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో భేటీ అయిన సీఎం రేవంత్‌రెడ్డి త్వరలోనే జిల్లాల పర్యటన చేపడుతానని చెప్పిన విషయం తెలిసిందే. జిల్లా కలెక్టర్లు కూడా ఆఫీసులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని సీఎం సూచించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోకి వెళ్లేందుకు సీఎం ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్ జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్దిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.