హైదరాబాద్: జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ సభ్యులకు భూకేటాయింపు పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే సమస్య పరిష్కరించవచ్చన్నారు. మా ప్రభుత్వం అనేక సమస్యలకు పరిష్కారాలు చూపిందని, గతంలో జర్నలిస్టులకు ఇళ్లు కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిదన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, సమస్యను పరిష్కరించాల్సిన వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీఎం పేర్కొన్నారు.
వృత్తిపరమైన గౌరవం మనకు మనమే పెంచుకోవాలని, వ్యవస్థల మీద నమ్మకం పెంచాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. గతంలో అసెంబ్లీ జరిగినప్పుడు జర్నలిస్టులను లోపలికి అనుమతించలేదని, మా ప్రభుత్వం వచ్చాక స్వీకర్ కు నేనే అసెంబ్లీ లోపలికి జర్నలిస్టులను అనుమతించాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఏ వర్గంలో అయినా కొందరు చేసే పని వల్లనే ఇబ్బంది కలుగుతోందని, గతంలో సచివాలయానికి వెళ్లేందుకు మాకే అనుమతి లేదన్నారు. కొంత మందికి పాస్లు ఇచ్చి లోపలికి రప్పించి ఇబ్బంది కలిగించాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి వెల్లడించారు.