12-03-2025 12:52:18 AM
హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాం తి): ముఖ్యమంత్రిగా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రేవంత్‌రెడ్డి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మం డిపడ్డారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముం దు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుచేయకుండా సీఎం కాలయాపన చేస్తున్నా రని మండిపడ్డారు.
ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులకు తగ్గట్టుగా కార్యాచరణ రూపొందించుకోవాలని, అన్నీ చేయిదాటి పోయా క నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరడం చిన్న పిల్లల చేష్టలని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ. 3 లక్షల కోట్లు ఉన్న తెలంగాణ అప్పు, కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ. 7.5 లక్షల కోట్లకు చేరుకున్నదని దుయ్యబట్టారు.
అప్పుల భారం తో ప్రభుత్వం కనీసం వడ్డీలు చెల్లించలేని పరిస్థితి నెలకొన్నదన్నారు. బీజేపీ ఇచ్చిన హామీ ఇచ్చిన మేరకు ఆర్‌ఆర్‌ఆర్ కలను నిజం చేస్తామని స్పష్టం చేశారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పనులు 65 శాతం పనులు పూర్తయ్యాయని, 2026 ఏప్రిల్‌లో ఫ్యాక్టరీలో ఉత్పత్తి కూడా ప్రారంభిస్తామని తెలిపారు.
కాంగ్రెస్ ఎంపీలు ఫ్యాక్టరీకి భూమిపూజ చేసి న విషయం కూడా తెలియకుండా కేంద్ర రైల్వేమంత్రికి వినతిపత్రం ఇవ్వడం సిగ్గుచేటన్నారు. రైతుభరోసా, మహిళలకు ఇచ్చిన హామీలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, పింఛన్లు, ప్రతి మండలంలో విద్యాసంస్థలపై కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో చర్చ లేకుండానే అమలు చేస్తే బాగుంటుందని హితవు పలికారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని బీజేపీ నెరవేరుస్తుందని స్పష్టం చేశారు.