30-04-2025 09:17:50 AM
విశాఖపట్నం: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరిగిన చందనోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన దురదృష్టకర సంఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chief Minister Nara Chandrababu Naidu) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గోడ కూలిపోవడం వల్ల భక్తులు మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు గోడ కూలిపోవడం( Simhachalam Temple Wall Collapse) కారణమని చంద్రబాబు నాయుడు అన్నారు.
మృతుల కుటుంబాలకు హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తూ, "ఈ విషాదకరమైన ప్రాణనష్టం నన్ను తీవ్రంగా బాధించింది" అని అన్నారు. సింహాచలం పరిస్థితి గురించి జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్‌తో మాట్లాడానని ఆయన అన్నారు. గాయపడిన వారికి సాధ్యమైనంత ఉత్తమ వైద్య చికిత్స అందేలా చూడాలని చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ పోస్ట్ ద్వారా ఈ సందేశాన్ని పంచుకున్నారు.
సింహాద్రి అప్పన్న(Simhadri Appanna swamy) చందనోత్సవంలో బుధవారం తెల్లవారుజామున అపశృతి చోటుచేసుకుంది. గాలి వానకు భారీ గోడ కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకుని ఏడుగురు భక్తులు మృతి చెందారు. మృతుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్(National Disaster Response Force), ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. రూ.300 టిక్కెట్ కౌంటర్ దగ్గర ఇటీవలే గోడ నిర్మాణం చేపట్టామని ఆలయ అధికారులు వెల్లడించారు. భారీగా ఈదురుగాలులకు రావడంతో భారీ టెంట్ ఎగిరి గోడమీద పడింది. టెంట్ పడడంతో గోడ కుప్పకూలిపోయింది.