అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు ఆకర్షించేందుకు తీసుకురావాల్సిన కొత్త పాలసీలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో బుధవారం అధికారులతో సమీక్షించారు. గత పదేళ్ల కాలంలో పెట్టుబడుల కోసం వివిధ సందర్భాల్లో చేసుకున్న ఒప్పందాలు, వాటి ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సీఎం చర్చించారు. 100 రోజుల్లో కొత్తగా నూతన ఇండస్ట్రియల్ పాలసీ, ఎంఎస్ఎంఇ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రానిక్, ఐటీ అండ్ క్లౌడ్ పాలసీ, టెక్స్ టైల్ పాలసీలు తీసుకురావాలని అన్నారు. అత్యుత్తమ పాలసీల ద్వారా పెట్టుబడుల ఆకర్షణకు అనువైన వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ హబ్ గా చెయ్యాలనే లక్ష్యంతో పాలసీలు రూపొందించాలని కుప్పం, మూలపేట, చిలమత్తూరు, దొనకొండ లేదా పామూరులో కొత్త క్లష్టర్స్ ఏర్పాటు చేయాలని..ఈ మేరకు ప్రక్రియ ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. కృష్ణపట్నం, నక్కపల్లి, ఓర్వకల్లు, కొప్పర్తి నోడ్స్ ప్రోగ్రెస్‌పై సీఎం చంద్రబాబు చర్చించారు.