అమరావతి: 'సమాజమే దేవాలయం... ప్రజలే దేవుళ్ళు' అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది.. నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది...స్త్రీలకు సాధికారతనిచ్చిన సంస్కర్త...స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆ మహానాయకుడిని స్మరించుకుంటూ ఏపీ సీఎం చంద్రబాబాబు నివాళులర్పించారు.
సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలనతో... "అధికారం అంటే పేదల జీవితాలు మార్చేందుకు వచ్చిన అవకాశం" అని నిరూపించిన మాననీయులు ఎన్టీఆర్ ఆశించిన సమసమాజాన్ని సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్(NTR) ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తామని...తెలుగు జాతిని నెంబర్ వన్ చేసేందుకు కంకణబద్ధులై ఉన్నామని తెలిపారు. ఆ యుగపురుషుని వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నానని పేర్కొన్నారు. నిరుపేదకు ఆహార భద్రత, పక్కా ఆవాసం కల్పించడమే లక్ష్యంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేసి పేదల గుండెల్లో అన్న ఎన్టీఆర్ స్థిరనివాసం ఏర్పరచుకున్నారని తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) నేతలు అన్నారు. తెలుగు జాతికి, తెలుగు సంస్కృతికి, తెలుగుభాషకు ఎనలేని సేవలందించిన తెలుగు వెలుగు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ శక పురుషునికి టీడీపీ నివాళి అర్పిస్తోందన్నారు.