calender_icon.png 10 March, 2025 | 5:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన ఏపీ సీఎం

10-03-2025 01:21:33 PM

విజయవాడ,(విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్న ముగ్గురు పార్టీ అభ్యర్థుల పేర్లను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు. టీడీపీ ప్రకటించిన మూడు ఎమ్మెల్సీ స్థానాలను బలహీన వర్గాలకే కేటాయించింది. వెనకబడిన వర్గాలను ఆది నుంచి ఆదరిస్తున్న టీడీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ స్థానాలను కూడా బీసీ, ఎస్సీ వర్గాలకే పేద్దపీట వేసింది. ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు గాను పొత్తులో భాగంగా రెండు సీట్లు జనసేన, బీజేపీకి కేటాయించగా మిగిలిన మూడు సీట్లకు టీడీపీ అభ్యర్థులను పోటీ చేస్తున్నట్లు అధికారంగా వెల్లడించింది.

అందులో రెండు బీసీలకు, ఒకటి ఎస్సీకి టీడీపీ అధిష్టానం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. మూడు ప్రాంతాల్లోంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసింది. రాయలసీమలోని కర్నూలు జిల్లాకు చెందిన బీసీ సామాజికవర్గ నేత బీటీ నాయుడుకి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. పార్టీలో మొదటి నుంచీ అంటిపెట్టుకుని ఉన్న బీదా రవిచంద్రకు కూడా పార్టీ ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించింది. యువతను ప్రోత్సహించడం, మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చే క్రమంలో ఎస్సీ సామాజికవర్గం నుంచి శ్రీకాకుళానికి చెందిన మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మకు పార్టీ అవకాశం ఇచ్చింది. టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికైన ముగ్గురు నేతలూ బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన వారిని బట్టి చూస్తే ఆ వర్గాలకు టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యత ఏంటనేది మరోసారి స్పష్టమైంది.

జనసేన తరుపున ఎమ్మెల్సీగా పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబును నామినేట్ చేస్తుందని ప్రకటించారు. బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, ఎంపి దగ్గుబాటి పురందేశ్వరి పార్టీ అభ్యర్థి ఎంపికపై సీనియర్ నాయకులతో చర్చలు జరుపుతున్నారు. ఈ పదవికి ప్రధాన పోటీదారులు సోము వీర్రాజు మరియు పి.వి.ఎన్. మాధవ్ ఉన్నారు. యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బి.టి. నాయుడు, అశోక్ బాబు పదవీకాలం మార్చి 29తో ముగియనున్నందున ఆంధ్రప్రదేశ్ లో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మార్చి 20వ తేదీన జరగనుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.