అత్యంత శక్తిమంతుడు.. మోదీ
తర్వాతి స్థానాల్లో మోహన్‌భగవత్, అమిత్‌షా, రాహుల్‌గాంధీ
ముఖ్యమంత్రుల్లో ఏపీ జాబితా ప్రకటించిన ‘ఇండియా టు డే’
న్యూఢిల్లీ, నవంబర్ 13: దేశ రాజకీయాల్లో ప్రధాని అత్యంత శక్తిమంతుడు అని ‘ఇండియా టు డే’ ప్రకటించింది. 2024లో రాజకీయాల్లో నేతల ప్రభావం, వారి శక్తిసామర్థ్యాలు, పనితీరు అనే అంశాలను పరిగణలోకి తీసుకుని తాజాగా ఆ మీడియా సంస్థ జాబితా విడుదల చేసింది. జాబితాలో రెండోస్థానంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, మూడోస్థానంలో కేంద్ర హోమంత్రి అమిత్‌షా, నాలుగోస్థానంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ నిలిచారు.
ఐదోస్థానాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దక్కించుకున్నారు. ప్రత్యేకంగా ప్రధాని మోదీ గురించి విశ్లేషిస్తూ..‘ప్రధాని మోదీ వరుసగా మూడుసార్లు ప్రధానిగా ఎన్నికై 60 ఏళ్ల రికార్డును తిరగరాశారు. అమెరికా, రష్యా, ఉక్రెయిన్ అధినేతలతో ఏకకాలంలో స్నేహ సంబంధాలు నెరపుతున్నారు. భారత ఆర్థిక వ్యవస్థను 4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లారు’ అని ఇండియా టు డే కొనియాడింది.
అలాగే ప్రధాని మోదీకి అమిత్‌షా కళ్లు, చెవుల్లా పనిచేస్తున్నారని, కేంద్రం తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల్లో ఆయన పాత్రే కీలకమని పేర్కొన్నది. రాహుల్‌గాంధీ గురించి ప్రస్తావిస్తూ.. ‘వరుసగా రెండుసార్లు ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయిన పార్టీకి రాహుల్‌గాంధీ తిరిగి ఆ హోదా తీసుకొచ్చార’ని పేర్కొన్నది. ఏపీ సీఎం చంద్రబాబు గురించి ప్రస్తావిస్తూ..‘2019 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయి, జైలుకు వెళ్లి కూడా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారు.
16 మంది ఎంపీలను పార్లమెంట్‌కు పంపారు. టీడీపీని ఎన్డీఏ కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా నిలిపార’ని కొనియాడింది.