18-03-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 17 (విజయక్రాంతి): మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి దుండగుడు ప్రవేశించిన ఘటనపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి.. సోమవారం ఆమెతో ఫోన్‌లో మాట్లాడారు. సంఘటనపై ఆరా తీశారు. ఆమెకు భద్రత పెంచుతామని హామీ ఇచ్చారు.
వేగంగా దర్యాప్తు చేసి వాస్తవాలు తేల్చాలని పోలీసులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 56లో గల డీకే అరుణ ఇంటికి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెళ్లారు. దుండగుడు ఎలా వచ్చాడు.. ఎలా వెళ్లాడు అనే విషయాన్ని స్వయంగా పరిశీలించారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు కల్పించాల్సిన భద్రత వివరాలను పోలీసులు సేకరించారు. దుండగుడిని గుర్తించి త్వరగా పట్టుకోవాలని సంబంధిత పోలీసు అధికారులకు సూచించారు. సీపీ వెంట డీసీపీ విజయ్‌కుమార్, ఏసీపీ వెంకటగిరి, ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి ఉన్నారు.