calender_icon.png 20 October, 2024 | 3:10 AM

ఉన్నతవిద్యపై నివేదిక కోరిన సీఎం!

20-10-2024 12:51:00 AM

  1. సమగ్ర వివరాలు అందజేయాలని ఆదేశాలు
  2. రూపకల్పనలో ఉన్నత విద్యామండలి

హైదరాబాద్, అక్టోబర్ 19(విజయక్రాంతి): రాష్ట్రంలోని ఉన్నతవిద్య స్థితిగతుల పై రాష్ట్రప్రభుత్వం దృష్టి సారించబోతుంది. ఇందుకు ఓ నివేదికను రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నత విద్యామండలిని ఆదేశించినట్లు తెలిసింది. ఇటీవల కొత్తగా నియమితులైన తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్1 ఐ పురుషోత్తం శనివారం సీఎంను కలిశారు.

ఈ సందర్భంగా ఉన్నత విద్య, యూనివర్సిటీల పనితీరు, ప్రొఫెసర్ల నియామకాలు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. గత పదేళ్ల కాలంలో పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఎలాంటి మార్పులు చేయాల్సి ఉంటుంది? పెండింగ్ సమస్యలు, నూతన విధానాల అమలు, కొత్త కోర్సులు, సంస్కరణలు లాంటి అంశాలపై సీఎం చర్చించినట్లు సమాచారం.

ఈ అంశాలపై ఓ నివేదికను సిద్ధం చేయాలని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. సమయం తీసుకోనైనా సమగ్ర నివేదికను అందజేయాలని సీఎం సూచించినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.