calender_icon.png 19 September, 2024 | 7:01 AM

ఆగ్రో గోల్‌మాల్!

17-09-2024 01:23:57 AM

  1. ఖమ్మం జిల్లాలో దారిమళ్లుతున్న యూరియా
  2. ప్రైవేట్ షాపుల్లో అధిక ధరలకు విక్రయం 
  3. కూసుమంచి, మిట్టపల్లి కేంద్రాలపై ఆరోపణలు

ఖమ్మం,సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): జిల్లా అధికారుల పర్యవేక్షణ లోపం, స్థానిక వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఖమ్మం జిల్లాలో ఏర్పాటుచేసిన రైతు ఆగ్రో గ్రోమోర్ సేవా కేంద్రాలు దారి తప్పాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం వల్ల వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఎంతో మంచి ఉద్దేశంతో రైతుల కోసం ఏర్పాటుచేసిన రైతు గ్రోమోర్ సేవా కేంద్రాల లక్ష్యం నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

నిరుద్యోగ యువకుల ఉపాధి, రైతుల సంక్షేమమే లక్ష్యంగా తక్కువ ధరకు ఎరువులను అన్నదాతలకు అందించి, ఆదుకోవాలనే ఉన్నత లక్ష్యంతో ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రైతు గ్రోమోర్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఉద్దేశం బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవ డంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతున్నది. ఖమ్మం జిల్లా కేంద్రంతోపాటు కూసుమంచి, వైరా, మిట్టపల్లి, తల్లాడ, నేలకొండపల్లి, మధిర, సత్తుపల్లి, కల్లూరు తదితర మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఇందులో కొన్ని నిబంధనలు ప్రకారం నడుస్తుండగా మరికొన్ని అక్రమాలకు నెలవుగా మారాయి. 

నిబంధనలకు నీళ్లు

కూసుమంచి, మిట్టపల్లి తదితర కేంద్రాల్లోని రైతు ఆగ్రోస్ సేవా కేంద్రాల నిర్వాహ కులపై ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. నిబంధనలు    భేఖాతరు చేస్తూ ప్రభుత్వం కేటాయించిన యూరియా ఎరువులను దారి  మళ్లించి, బయట ప్రైవేట్ దుకాణాలకు తరలించి, అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో కూసుమంచి మండల కేంద్రంలోని కేంద్రంపై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. యూరియాను సమీపంలోని ప్రైవేట్ షాపులకు తరలించి, బ్లాక్ లో అమ్ముకుంటున్నట్లు రైతులు ఆరోపించి, ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు.

కేంద్రానికి వచ్చిన రైతులను ప్రైవేట్ దుకాణాల వద్దకు వెళ్లి యూరియాను కొనుగోలు చేయాలని సూచించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కొంత మంది కేంద్రాల నిర్వాహ కులు ధనార్జనే ధ్యేయంగా ఇష్టానుసారం అమ్మకాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పనిముట్లు సరసమైన ధరలకు అందించేందుకు ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసింది. వీటిని నడిపే వ్యక్తు లు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులై ఉండరాదు. స్థానికంగా ఉంటూ వ్యవసాయంలో డిప్లొ మా, అగ్రికల్చర్ డిగ్రీ, ఉద్యాన డిగ్రీ, వ్యవసాయ అనుబంధ డిగ్రీల్లో ఏదో ఒకటి చేసి ఉండాలి. ఆగ్రో కేంద్రం మంజూరైనవారు ఖచ్చితంగా స్థానికంగా నివాసం ఉండాలనే నిబంధన ఉంది. కానీ మిట్టపల్లి కేంద్రం నిర్వాహకుడు ఖమ్మంలోని ఓ కళాశాలలో పనిచేస్తూ బినామీ ద్వారా కేంద్రాన్ని నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

జిల్లా కేంద్రం నుంచి వచ్చిన యూరియాను దిగుమతి చేసుకుని, ప్రైవేట్ దుకాణానికి తరలించి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. లైసెన్స్ పొందిన వ్యక్తి నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా అధికారులకు పట్టకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూరియాను  అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఫిర్యాదులు వచ్చినా సంబంధిత అధికారులు స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి ఉన్నతాధికారులు స్పందించి, అక్రమాలకు పాల్పడుతున్న రైతు ఆగ్రో సేవా కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకుని, రైతులను న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ అంశంపై వివరణకు ప్రయత్నించగా జిల్లా వ్యవసాయ అధికారి స్పందించలేదు.  

మూడురోజులు మోస్తరు వర్షాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 16(విజయక్రాంతి): రాష్ట్రంలో మూడు రోజ లపాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని సోమవారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకా శం ఉందని చెప్పింది. ఈ మూడు రోజు ల పాటు రాష్ట్రంలో ఎలాంటి హెచ్చరికలను జారీ చేయడం లేదని వెల్లడించింది. రాష్ట్రంలో సోమవారం అత్యధికంగా 2.2 మిల్లీ మీటర్ల వర్షాపాతం మంచిర్యాలలో నమోదైంది. నిజామాబాద్‌లో 0.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.