calender_icon.png 6 February, 2025 | 7:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు సీఎల్పీ సమావేశం

06-02-2025 12:59:18 AM

  1. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్
  2. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయలోపంపై చర్చ
  3. ‘రహస్యభేటీ’ ఎమ్మెల్యేల నుంచి వివరణ తీసుకునే అవకాశం

హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): అధికార కాంగ్రెస్ పార్టీలోని పరి ణామాలు కాకరేపుతున్నాయి. స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తు న్న వేళ జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోవడంతో పాటు పార్టీకి చెందిన పది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం కావడం పార్టీని కలవరపెడుతోంది.

ఇదే అంశంపై గతంలో ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్ కూడా సున్నిహితంగానే హెచ్చరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి వెళ్ల డం లేదని కూడా ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన పీఏసీ సమావేశంలో కేసీ వేణుగోపాల్ పార్టీ నేతలను మందలించారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిద్దుబాటు చర్యలకు దిగారు.

అందులో భాగంగా గురువారం ఉదయం 11 గంటలకు ఎంసీహెచ్‌ఆర్డీలో మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలతో సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌మున్షీ, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ కూడా హాజరుకానున్నారు.

ఎమ్మెల్యేల రహస్య భేటీ విషయంలో పార్టీలో జరుగుతున్న చర్చ నేపథ్యంలో ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా భేటీ కావడం కంటే పార్టీ పరంగా ఎమ్మెల్యేలందరితో సమావేశమై జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పార్టీ, ప్రభుత్వపరంగా వారికున్న సమస్యలపై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, స్థానిక సంస్థల ఎన్నికలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే జిల్లాల్లో మంత్రులకు, ఎమ్మెల్యేలకు మధ్య ఏమైనా సమస్యలున్నాయా..? క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి..? అనే అంశాలపై దీపాదాస్‌మున్షీ ఎమ్మెల్యేల నుంచి క్లారిటీ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.  

ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశం.. 

ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌మున్షీ నిర్వహించే ప్రత్యేక సమావేశం ఉమ్మడి జిల్లాల వారీగా నిర్వహించాలని నిర్ణయించారు. అందుకు షెడ్యూల్ కూడా ఖరారైంది. మధ్యాహ్నం  3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు.

సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు వరంగల్, కరీంనగర్ జిల్లాలు, సాయంత్రం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు నల్లగొండ, మెదక్, హైదరాబాద్, సాయంత్రం 6:45 నుంచి రాత్రి 7:45 గంటల వరకు రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్‌రెడ్డి, దీపాదాస్‌మున్షీ భేటీ కానున్నారు. భేటీలో ఎమ్మెల్యేల సమస్యలతో పాటు ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేస్తారని సమాచారం. 

దానం ఇంట్లో ‘పార్టీ మారిన ఎమ్మెల్యేల’ సమావేశం

మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్ నివాసంలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలు బుధవారం సమావేశమయ్యారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై  పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లడం.. కోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

స్పీకర్ కార్యాలయం నోటీసుల విషయంలో ఏం చేయాలి..? అసెంబ్లీ సెక్రటరీకి, సుప్రీంకోర్టుకు ఏం సమాధానం ఇవ్వాలి..? అనే అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని బీఆర్‌ఎస్ సీరియస్‌గా తీసుకున్న నేపథ్యంలో న్యాయపరంగా ఉన్న అంశాలు ఏమిటీ అనేదానిపైన చర్చించినట్లు తెలుస్తోంది.