calender_icon.png 25 November, 2024 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెస్కో ద్వారానే వస్త్రాలు కొనాలి

30-10-2024 12:46:03 AM

  1. నేత కార్మికులకు పని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
  2. ఆయా శాఖల అధికారులకు  మంత్రి తుమ్మల ఆదేశం

హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాం తి): అన్ని ప్రభుత్వ శాఖలకు, కార్పొరేషన్లకు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమైన వస్త్రాలను తప్పనిసరిగా టెస్కో ద్వారానే కొనుగోలు చేయాలని అధికారులను చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.

వారం రోజుల్లోగా నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్‌ను టెస్కో సంస్థ జారీ చేసినప్పుడు మాత్రమే ఇతర సంస్థల నుంచి కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో టెస్కోకు వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ల కేటాయింపునకు సంబంధించి వివిధ సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నవంబర్ 15లోగా వస్త్రాల కోసం ఇండెంట్ టెస్కోకు సమర్పించాలని కోరారు. నేత కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం జీవో నం.1ను తీసుకువచ్చిందని, ఈ జీవోను అన్ని శాఖలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

కొనుగోలు విషయంలో తప్పనిసరిగా ప్రభుత్వ ఆదేశాలు పాటించి నేత కార్మికుల ఉపాధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఉత్తర్వులకు విరుద్ధంగా ఎవరైనా ప్రైవేటు సంస్థల నుంచి కొనుగోలు చేపడితే బాధ్యులపై చర్యలు ఉంటాయని తెలిపారు. 

ఐదేళ్ల వరకు డిజైన్ మార్చొద్దు.. 

కొన్ని సంక్షేమ శాఖలు ఏటా యూని ఫాం, ఇతర వస్త్ర డిజైన్ల రంగులు మార్చడం వల్ల సప్లులో ఆలస్యం జరుగుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, అందుకే కనీసం ఐదేళ్లు డిజైన్ మార్చకుండా స్థిరంగా ఉంచాలని మంత్రి సూచించారు. రాబోయే విద్యా సంవత్సరం అవసరమైన ఇండెంట్‌ను టెస్కోకు నవంబర్ 15 వరకు ఇవ్వాలని చెప్పారు.

నేత కార్మికులకు నూలు కొనుగో లు, వస్త్ర ఉత్పత్తి, డైయింగ్, ప్రాసెసింగ్‌కు 3 నెలల నుంచి 6 నెలల సమయం పడుతుందని, అందుకే 6 నెలల ముందే టెస్కోకు ఇం డెంట్ సమర్పిస్తే సకాలంలో సప్లు చేయడానికి వీలుంటుందని తెలియజేశారు.

2024-25  సంబంధించిన ఇండెంట్‌ను తెప్పించుకుని 100 శాతం సప్లు చేయాలని టెస్కో ఎండీ, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్‌ను ఆదేశించారు. అదేవిధంగా టెస్కోకు వివిధ సంక్షేమ శాఖలు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను కోరారు.