హనుమకొండ: పర్యావరణ హితానికి క్లాత్ బ్యాగులనే వినియోగించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో మెప్మా ఆధ్వర్యంలో తయారుచేసిన పర్యావరణహిత క్లాత్ బ్యాగులను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణానికి ముప్పు కలుగుతుందని, కాబట్టి పర్యావరణహితానికి క్లాత్ బ్యాగులనే వినియోగించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లా కలెక్టరేట్ లో ప్లాస్టిక్ బాటిళ్ల నియంత్రణకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. దీంతో ప్లాస్టిక్ రహిత ప్రాంగణంగా కలెక్టరేట్ ఉండేటట్టు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిస్థాయిలో తగ్గించుకొని పర్యావరణహిత బ్యాగులు, ఇతర వస్తువులనే వినియోగించాలన్నారు. పర్యావరణహితం కోసం మెప్మా ఆధ్వర్యంలో క్లాత్ బ్యాగులను తయారుచేసి అందుబాటు ధరలలో తీసుకురావటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, డిఆర్ఓ వై.వి. గణేష్, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు వెంకటేష్ డాక్టర్ కె నారాయణ, మెప్మా అధికారులు రజిత రాణి, తదితరులు పాల్గొన్నారు.