- ఎగువనుంచి తగ్గిన ఇన్‌ఫ్లో
- మూసీకి కొనసాగుతున్న వరద
- రంగనాయకసాగర్‌కు కాళేశ్వరం జలాల పరుగులు
విజయక్రాంతి నెట్‌వర్క్, సెప్టెంబర్ 5: రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లోలు తగ్గాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి కేవలం 40 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. భారీ ఇన్‌ఫ్లో లేకపోవడంతో ప్రాజెక్టు 26 క్రస్టుగేట్లను ఇప్పటికే మూసేశారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 587.70 అడుగులు (305.9222 టీఎంసీలు)గా ఉంది.
ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగిస్తూ 29,557 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కుడి కాల్వకు 8,529 క్యూసెక్కులు, ఎస్సెల్బీసీ (ఏఎమ్మార్పీకి) 1,800 క్యూసెక్కులు, లోలెవల్ కాల్వకు 600 క్యూసెక్కులు వదులుతున్నారు. ఎడమ కాల్వకు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం శివారులో గండిపడడంతో నాలుగు రోజుల క్రితం నీటిని నిలిపేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సాగర్‌కు 40 వేల ఇన్‌ఫ్లో వస్తుండడగా అంతే మొత్తం అవుట్ ఫ్లో కొనసాగుతున్నది.
మూసీకి తగ్గిన వరద
నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టింది. రిజర్వాయర్‌కు 5,680 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో 2 క్రస్టుగేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి స్పిల్ వే ద్వారా 2,445 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలుకాగా ప్రస్తుతం 3.59 టీఎంసీలుగా ఉంది.
అన్నపూర్ణకు కొనసాగుతున్న ఎత్తిపోత
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అన్నపూర్ణ రిజరాయర్‌లోకి కాళేశ్వర జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. 3.5 టీఎంసీల సామర్థ్యం ఉన్న జలాశయంలో ప్రస్తుతం 3 టీఎంసీలకు చేరుకుంది. మధ్యమానేరు దారా 6400 క్యూసెక్కుల నీటిని రెండు పంపుల దారా ఎత్తిపోస్తున్నారు. క్యాచ్ మెంట్ దారా 100 క్యూసెక్కుల నీరు చేరింది. జలాశయం ఎగువన ఉన్న రంగనాయకసాగర్ కు 6600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
భద్రాచలం వద్ద మొదటి హెచ్చరిక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గురువారం సాయంత్రం గోదావరి నీటిమట్టం 45.5 అడుగులకు చేరుకొంది. మొదటి ప్రమాద హెచ్చరిక (43 అడుగులు) కొనసాగుతోంది. బుధవారం రాత్రి నుంచి కొద్దిగా తగ్గినట్టు తగ్గిన గురువారం ఉదయం తిరిగి పెరుగుతూ వచ్చింది. సాయంత్రం 5 గంటలకు 45.5 అడుగుల వద్ద నిలకడగా ఉంది. అయితే శుక్రవారం ఉదయానికి ప్రవాహం తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నియోజకర్గం పరిదిలో వేలాది ఎకరాల్లో పత్తి, మిర్చి పంటలు నీట మునిగాయి. మహ బూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, భధ్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు భరోసా కల్పించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొంటుందని హామీ ఇచ్చారు.