calender_icon.png 18 October, 2024 | 6:02 PM

కాలేజీల బంద్ విరమణ

18-10-2024 02:45:05 AM

  1. నేడు తెరుచుకోనున్న డిగ్రీ, పీజీ కళాశాలలు
  2. డిప్యూటీ సీఎంతో చర్చలు సఫలం
  3. రూ.650 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ

హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): డిగ్రీ, పీజీ కాలేజీల బంద్‌ను తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీల యాజమాన్య సంఘం విరమించు కుంది. నేటి నుంచి ఎప్పటిలాగానే కళాశాలలు తెరుచుకోనున్నాయి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్య సంఘాల నేతలు బొజ్జ సూర్యనారాయణ రెడ్డి, యాద రామకృష్ణ, పరమేశ్వర్, నరసింహా యాదవ్ తదితరులు ప్రజాభవన్‌లో జరిపిన చర్చలు సఫలమైనట్లు వారు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా సెక్రటేరియేట్ మీడియా పాయింట్ ఆవరణలో మీడియాతో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ హామీతో ప్రైవేట్ కాలేజి అసోసియేషన్‌లు బంద్‌ను విరమించేందుకు ఒప్పుకున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేస్తామని హామీ ఇచ్చిందని, ఒకవేళ చేయకపోతే తాను ఆమరణ దీక్షకు దిగు తానని కీలక వ్యాఖ్యలు చేశారు.

పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గత మూడునాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా 1800 కాలేజీలు బంద్ జరుపుతున్నాయని, బడ్జెట్ విడుదల చేయకుంటే కళాశాలలు నడిపే పరిస్థితి లేదని డిప్యూటీ సీఎం దృష్టికి ఆయన తీసుకెళ్లారు. మొదటి విడుతలో టోకెన్లకు సంబంధించిన నిధులు రూ.650 కోట్లు విడుదల చేయాలని డిప్యూటీ సీఎం దృష్టికి యాజమాన్యాలు తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పం దించినట్లు అసోసియేషన్ నాయకులు తెలిపారు.

నాలుగైదు రోజుల్లో నిధులు విడుదల చేస్తామని హామీనిచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ హామీతో బంద్‌ను విరమిస్తున్నామని, నేటి నుంచి కాలేజీలను యథావిధిగా నడిపిస్తామని తెలిపారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను కూడా కలిసి తమ సమస్యల ను విన్నవించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు సుభాష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రామారావు, భాస్కర్ రావు, శ్రీనివాస్, అశోక్ తదిరులు పాల్గొన్నారు.