calender_icon.png 22 October, 2024 | 7:04 AM

మూతపడ్డ టెక్స్‌టైల్ పార్క్!

21-10-2024 12:00:00 AM

* వస్త్ర పరిశ్రమ సిరిసిల్లలో మూగబోయిన సాంచాలు

* పనులు లేక కార్మికుల పస్తులు 

* రోడ్డునపడ్డ 1500 మంది

* యూనిట్ల ప్రారంభం కోసం ఎదురుచూపులు

* ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు


సిరిసిల్ల,అక్టోబర్ ౨౦ (విజయక్రాంతి): సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. ౧౫ రోజులుగా సిరిసిల్లలోని టెక్స్‌టైల్స్ పార్క్‌లో 104 యూనిట్లు మూతపడడంతో 1,500 మంది కార్మికుల బతుకులు రోడ్డున పడ్డాయి. దసరా,బతుకమ్మ పండుగలకు ముందే  టెక్స్‌టైల్స్ పార్క్‌లో యూనిట్లు మూతపడడంతో చేసేందుకు పనులు లేక, చేతిలో డబ్బులు లేక పస్తులుండే దుస్థితి నెలకొంది.

యూనిట్లు ప్రారంభమై పనులు దొరుకుతాయేమోనని కార్మికులు గంపెడు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఆ దిశగా యజమానులుగానీ, అధికారులుగానీ చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. ఉత్పత్తి చేసిన వస్త్రానికి మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేకపోవడం, సబ్సిడీ విద్యుత్ బిల్లులు చెల్లించ కపోవడంతో ఈ నెల 6న టెక్స్‌టైల్స్ పార్క్ వస్త్రోత్పత్తిదారుల సంఘం యజమానులు బంద్‌కు పిలుపు నిచ్చారు.

దీంతో టెక్స్‌టైల్ పార్కుకు అనుబంధంగా ఉన్న పరిశ్రమలతోపాటు స్థానిక కార్మికులు, ఇతర రాష్ట్రాల నుం చి బతుకుదెరువు కోసం వచ్చిన కార్మికులు రోడ్డున పడ్డారు. ప్రభుత్వం యజమానులతో చర్చలు జరుపాలని, పరిశ్రమను సం క్షోభం నుంచి బయట వేసేలా చర్యలు చేపట్టాలని కార్మికులు కోరుతున్నారు.

బతుకమ్మ చీరలతో బతుకులు ఆగం

గత ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టినప్పటి నుంచి కార్మికుల బతుకులు ఆగమయ్యాయి. ౩ నెలల పాటు ఉండే బతుకమ్మ చీరల తయారీ కారణంగా పరిశ్రమల యజమానులు మిగతా వస్త్రాల తయారీ నిలిపివేస్తున్నారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి సిరిసిల్లకు వచ్చే ఆర్డర్లు తగ్గిపోయాయి. అటు అప్పటికే ఉత్పత్తి చేసిన వస్త్రం కూడా గోదాంలో నిల్వ ఉండిపోతుంది.

ఆ వస్త్రానికి తగిన ధర లభించక పోవడంతో నష్టపోతామని భావిస్తున్న యజమానులు ఏకంగా యూనిట్లనే బంద్ చేస్తున్నారు. లాభాలు వస్తే యజమానులు తీసుకొని, నష్టాలు వస్తే కార్మికులను కష్టాల పాలుచేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. బతుకమ్మ చీరల తయారీకి సంబంధించి..

గత ప్రభుత్వం నేతన్నలకు రూ.270 కోట్ల పైగా బకాయిలు ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వస్త్ర పరిశ్రమను గట్టేక్కించేందుకు రూ.197 కోట్ల పెండింగ్ బిల్లులను మంజూరుచేసింది. అదేవిధంగా రూ.50 కోట్లతో వేములవాడలో యార్న్ డిపోను మంజూరు చేసింది. అయినా, యజమానులు టెక్స్‌టైల్ పార్క్‌ను మూసివేయడంతో కార్మికుల బతుకులు ఆగమయ్యాయి.  

విద్యుత్ సబ్సిడీ బిల్లులు రాలేదని..

ఇతర రాష్ట్రాల మాదిరిగా టెక్స్‌టైల్ పార్క్‌లోని యూనిట్లకు విద్యుత్ సబ్సిడీ, రీయంబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం ఇవ్వడం లేదనీ, ఉత్పత్తి చేసిన వస్త్రం ౩ నెలలుగా మూలకు ఉండటంతో నష్టపోతున్నామనే సాకుతో యజమానులు పరిశ్రమలను మూసివేశారు. మరమగ్గాలను కుటీర పరిశ్రమగా గుర్తించిన గత ప్రభుత్వం మూడో క్యాటగిరి కిందకు తీసుకొచ్చి, యూనిట్ రూ.8లో రూ.2 సబ్సిడీని మంజూరు చేసింది.

బద్దెనపల్లి గ్రామీణ ప్రాంతం కావడంతో టెక్స్‌టైల్స్ పార్క్‌కు మాత్రం యూ నిట్‌కు రూ.8కు రూ.4 రీయింబర్స్‌మెంట్ ఇచ్చేది. ప్రస్తుతం ఆ బిల్లులు ఇవ్వడం లేదని, ఉత్పత్తి చేసిన వస్త్రానికి మార్కెట్‌లో ధర లేక, కొత్త ఆర్డర్లు రాకపోవడంతో గత్యంతర లేకపోవడంతో పార్క్‌ను మూసివేశామని యజమానులు చెప్తున్నారు.