జగిత్యాల అర్బన్, డిసెంబర్ 23 : ధర్మపురిలోని పవిత్ర గోదావరినదిలో మురికి నీరు కలవకుండా చర్యలు చేపడుతున్నామని, దీనికి గానూ ఎస్టీపీల నిర్మాణం కోసం ముఖ్యమంత్రి రేవంత్’రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసినట్టు ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్’కుమార్ పేర్కొన్నారు. సోమవారం ధర్మపురి పట్టణంలో ఆయన విస్తృతంగా పర్యటించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు.
అయోధ్య నుండి పాదయాత్రగా తీసుకువచ్చిన శ్రీరామ చంద్రుడి పాదుకలను దర్శించుకున్నారు. అనంతరం వెజ్, నాన్ వెజ్ మార్కెట్ సముదాయాన్ని పరిశీలించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న గద్దెలను కూల్చివేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్య పనులపై అధికారులకు తగు సూచనలు చేశారు. గోదావరి నదిలో డ్రైనేజీ నీరు కలవకుండా ఎస్టిపి నిర్మాణానికి పరిపాలన అనుమతుల కొరకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.
గత పాలకులు కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయక పనులు అసంపూర్తిగా ఉండిపోవడం జరిగిందని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బిల్లులు విడుదల అయ్యేలా చూస్తామన్నారు. మాత శిశు ఆసుపత్రి మిగులు పనులను పూర్తి చేయించి త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరు లు పాల్గొన్నారు.