calender_icon.png 10 January, 2025 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వసతి గృహాల్లో శుభ్రత, నాణ్యత పాటించాలి

09-01-2025 07:48:34 PM

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు 

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి...

కరీంనగర్ (విజయక్రాంతి): జిల్లాలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో శుభ్రత పాటించాలని, నాణ్యమైన సరుకులు వినియోగించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి(Collector Pamela Satpathy) వసతి గృహ సంక్షేమ అధికారులను ఆదేశించారు. ఎవరైనా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హాస్టల్ నిర్వహణపై వసతి గృహాల ప్రత్యేక అధికారులు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, వార్డెన్లకు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సరుకుల సరఫరాదారు నుండి ఏ రోజుకు కావలసిన సరుకులను ఆ రోజు స్వీకరించాలని అధికారులకు సూచించారు. నిలువ ఉండేలా ఎక్కువ సరుకులను సరఫరా చేస్తే నిబంధనల ప్రకారం చర్య తీసుకుంటామన్నారు. వంట పాత్రలను, వంట గదిని శుభ్రంగా ఉంచాలని తెలిపారు. ఆర్వో వాటర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు.

డైనింగ్ టేబుల్ శుభ్రంగా ఉండాలని, తాగునీటిని మిషన్ భగీరథ విభాగం వారితో పరీక్ష చేయించాలని ఆదేశించారు. అవసరానికి మించి కూరగాయలు పాలు వంటివి తీసుకోరాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నిలువ చేయరాదని అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కామన్ డైట్ మెనూలో పేర్కొన్న విధంగానే అల్పాహారం, భోజనం అందజేయాలన్నారు. మెనూ అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వసతి గృహాలను ప్రత్యేక అధికారులు నిత్యం క్షేత్రస్థాయి సందర్శన చేయాలన్నారు. ఎంఈఓ లు కూడా హాస్టల్లో భోజనాల తయారు తీరును పరిశీలించాలన్నారు. నూతన కామన్ మెనూ అమలు కోసం ఇంకా ఏమైనా వంట పాత్రలు వంటివి కావాలంటే అందిస్తామని తెలిపారు. హాస్టల్లో ఏవైనా మరమ్మత్తులు ఉంటే పూర్తి చేయిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, డిఆర్ఓ పవన్ కుమార్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ పాల్గొన్నారు.