calender_icon.png 6 January, 2025 | 1:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శుచి, శుభ్రత కానరాని మార్కెట్లు

11-09-2024 12:00:00 AM

హైదరాబాద్ నగరంలో ప్రసిద్ధి చెందిన మార్కెట్లు  గుడిమల్కాపూర్, మాదన్నపేట, కొత్తపేట, బోయినపల్లి, గడ్డి అన్నారం, మెహిదీపట్నం, ఎర్రగడ్డ  రైతు బజార్ మార్కెట్లతోపాటు చిన్న మార్కెట్ల నుంచి  ప్రతిరోజు కోటిమందికి కాయగూరలు, పండ్లు  సరఫరా అవుతున్నాయి. మార్కెట్‌లో కాయగూరలు,  పండ్లు నిల్వచేసే ప్రాంతాలు, కమిషన్ ఏజంట్ల  ప్రదేశాలను చూసినట్లయితే అన్నం సహించదు. మార్కెట్లు దుర్గంధ పూరితంగా ఉంటున్నాయి. వ్యక్తిగత పరిశుభ్రత, ప్రజారోగ్య వ్యవస్థను పటిష్ఠ పర్చడం, రోగాలు ప్రబలకుండా నివారణ చర్యలను ప్రభుత్వం ప్రథమ కర్తవ్యంగా భావించాలి. ఏదైనా సరిపడని నూనె వాడిన పదార్థాలు తిన్నప్పుడు విరేచనాలు లేదా ప్రయాణ సమయాల్లో విరేచనాలు సహజం. కానీ, ఈ మార్కెట్లలో అమ్మే తినుబండారాలు తింటే విరేచనాలు ఖాయం. 

చాలా నగరాల్లో మార్కెట్టుకు కాయగూరలు, పండ్లు, నిత్యావసర సరుకులు గ్రామీణ ప్రాంతాల నుండి లేక సుదూర ప్రాంతాల నుంచి తీసుకువచ్చే లారీ లు, ట్రక్కుల డ్రైవర్లు, హమాలీలు, రైతులకు ఎక్కడా మరుగుదొడ్లు ఉండవు. పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నా నిర్వహణ లేక భయంకరంగా ఉంటాయి. ఇక, మహిళల సంగతి ఆ దేవుడికే ఎరుక. నగరంలోని వ్యాపార, వాణిజ్య సముదాయా ల్లోనూ చాలావాటికి మరుగుదొడ్లు కనిపించడం లేదు. మున్సిపల్ నిబంధనల ప్రకారం ప్రతి అంతస్తుకు సామూహిక మూత్రశాల ఉండాలి.

అలా ఉంటేనే, అనుమతులు ఇస్తారు. కానీ, టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా అనుమతులు ఇచ్చేస్తున్నారు. ‘స్వచ్ఛ భారత్’లో భాగంగా చాలా నగరాలు ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ సాధించినా, బహిరంగ మూత్ర విసర్జనను నివారించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. స్వచ్ఛ భారత్ సెస్ ఎందుకు వసూలు చేస్తున్నారో, నిధులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారో తెలియని పరిస్థితి. కేవలం నినాదాలకే పరిమితమై ఆచరణలో శూన్యంగా వ్యవహరిస్తున్నది ప్రభుత్వం. రహదారి రవాణా రంగం దేశ ప్రగతికి అత్యంత ముఖ్యమైంది. 

రవాణా మౌలిక సదుపాయాలు దేశ పురోగతికి వేగాన్ని, సామర్థ్యాన్ని పెం చుతాయి. వస్తువులను రవాణా చేయడం, పంపిణీ చేయడంలో నగరాల్లో న డుస్తున్న స్థానిక రవాణా కీలక పాత్ర పోషిస్తుంది. దేశంలో వ్యవసాయం తర్వా త ఎక్కువమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న రంగం ఇదే. అంతటి ప్రాధాన్యం కలిగిన రవాణా రంగానికి ప్రభుత్వాలు చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యవస్థలో ఈ రంగం అతి కీలకమని గుర్తించి ప్రభుత్వాలు తోడ్పాటును ఇచ్చినట్లయితే దీనిపై ఆధారపడి జీవిస్తున్న ప్రజలు ప్రభుత్వానికి రుణపడి ఉంటారు.

సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రవాణా కార్మికులకు సరైన తిండి, నీరు సదుపాయాలు లేవు.  మార్కెట్లను తగిన విధంగా ఆధునీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. పార్కింగ్, తాగునీటి వసతులను ప్రభుత్వం కల్పించాలి. రోజుకు  రెండుసార్లు చెత్త సేకరణ జరగాలి. అలాగే, దుర్గంధపూరిత ప్రదేశాలలో డీడీటీ, బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్  పిచికారీ చేయించాలి. రైతులకు, రవాణా కార్మికులకు, చిన్న వర్తకులకు క్యాంటీన్ సౌకర్యం కల్పించి మెరుగైన వసతులు ఏర్పరచాలి.  

 డా. ఎం. సురేష్ బాబు