calender_icon.png 8 January, 2025 | 11:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిమాండ్‌కు అనుగుణంగా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ

26-12-2024 02:49:09 AM

  1. 2030 నాటికి 20వేల మెగావాట్ల ఉత్పత్తే లక్ష్యం
  2. జనవరి 3న హెచ్‌ఐసీసీలో సమావేశం
  3. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

హైదరాబాద్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని ప్రతిపాదిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, వివిధ రంగాల్లో విస్తరించి ఉన్న విభిన్న ఆర్థిక వ్యవస్థను కలిగి ఉందన్నారు.

రాష్ర్టం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 2023-24లో 15,623 మెగావాట్లు ఉండగా.. 2027--28 నాటికి 20,968 మెగావాట్లకు, 2034--35 నాటికి 31,809 మెగావాట్లకు పెరుగుతుందని తెలిపారు. విద్యుత్ అవసరాలు 2023--24లో 85,644 మిలియన్ యూనిట్లు ఉండగా.. 2027--28 నాటికి 1,15,347 మిలియన్ యూనిట్లకు, 2034--35 నాటికి 1,50,040 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు వివరించారు.

తెలంగాణ 2030 నాటికి స్వచ్ఛమైన, స్థిరమైన 20వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నదని వెల్లడించారు. హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, జాతీయ స్థాయిలో పెట్టుకున్న లక్షాన్ని అందుకోడానికి గానూ జనవరి 3న హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో భాగస్వాములతో సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. దేశ, విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారని మంత్రి పేర్కొన్నారు.