07-04-2025 11:24:40 PM
అవమాన భారంతో ఆత్మహత్యాయత్నానికి 9వ తరగతి విద్యార్థిని..
నాగర్ కర్నూల్ జిల్లా నాగనూలు కేజీబీవీలో ఘటన...
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): రాత్రి సమయంలో స్టడీ అవర్స్ కు లేటుగా వచ్చిందన్న కోపంతో 9వ తరగతి విద్యార్థిని నీరు తాగనివ్వకుండా వాష్ రూమ్ కూడా వెళ్ళనివ్వకుండా గంటల తరబడి ఓ టీచర్ నిల్చోబెట్టి పనిష్మెంట్ ఇచ్చింది. దీంతో మనస్థాపం చెందిన 9వ తరగతి విద్యార్థిని చాకుతో చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా నాగనూలు గ్రామంలోని కేజీబీవీ పాఠశాలలో సోమవారం వెలుగు చూసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... తాడూరు మండలం అంతారం గ్రామానికి చెందిన ధనుంజయలు తన కుమార్తె యామిని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నాగనూలు కేజీబీవీ పాఠశాలలో చేర్పించాడు.
9వ తరగతి చదువుతున్న యామిని ఆదివారం రాత్రి ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి నిర్వహించిన స్టడీ అవార్డ్స్ కి లేటుగా వచ్చిందని సాకుతో గంటల తరబడి నిల్చబెట్టింది. కనీసం దాహం వేస్తోంది నీరు కావాలని అడిగినా, వాష్ రూమ్ వెళ్తానని అడిగినా పట్టించుకోలేదని బూతు పదజాలంతో దూషించినట్లు ఆరోపించింది. దీంతో విద్యార్థి యామిని మనస్తాపం చెంది కత్తితో చేయి కోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తన కూతుర్ని మానసికంగా హింసించిన ఇంగ్లీష్ టీచర్ పై చర్యలు తీసుకోవాలని డీఈవో రమేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. దీంతో కేజీబీవీ పాఠశాలను ఎంఈఓ భాస్కర్ రెడ్డి సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.