13-02-2025 02:22:59 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): అణచివేతకు గురైన కులాల్లోని అసమానతలను రూపుమాపేందుకే వర్గీకరణ అని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. వర్గీకరణ ఏ కులానికో, వర్గానికో వ్యతిరేకం కాదన్నారు. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. ప్రతీ గడపకూ వర్గీకరణ ఫలాలు తీసుకెళ్లే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, లక్ష్మీకాంతారావు, అడ్లూరి లక్ష్మణ్, మందుల సామేల్, వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాద య్య, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు తదితరులు బుధవారం మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి దామోదర రాజనర్సింహతో భేటీ అయ్యారు. దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ ఆకాంక్షను నెరవేరుస్తున్న సందర్భంగా మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
వర్గీకరణను ముందుకు తీసుకెళ్లే అంశంపై మంత్రితో వారు చర్చించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మంత్రి వారికి దిశానిర్ధేశం చేశారు. వర్గీకరణలో అవలంబించిన శాస్త్రీయ పద్ధతులను ప్రజలకు వివరించాలని చెప్పారు. సమావేశంలో ప్రొఫెసర్ మల్లేశం, టీపీసీసీ నాయకుడు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.