calender_icon.png 4 February, 2025 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాబినెట్ సబ్‌కమిటీకి వర్గీకరణ నివేదిక

04-02-2025 01:47:03 AM

  1. రిపోర్టుపై ఉత్తమ్ కమిటీ సుదీర్ఘంగా చర్చ 
  2. తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి మంత్రులు

హైదరాబాద్, ఫిబ్రవరి 3(విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణపై రూపొందించిన ఏకసభ్య జ్యుడీషియల్ కమిషన్ రూపొందించిన నివేదిక సోమవారం నీటిపారు దల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని సబ్‌కమిటీకి  అందింది. ఏకసభ్య కమిషన్ చీఫ్ జస్టిస్ షమీమ్ అక్తర్ సచివాలయంలో సిఫార్సులతో కూడిన నివేదికను సబ్ కమిటీ అందజేశారు. 

ఈ రిపోర్టుపై సబ్ కమిటీ సోమవారం రెండు దఫాలుగా సచివాలయంలో చర్చించింది. మధ్యాహ్నం  ఒకసారి, రాత్రి మరోసారి అక్తర్ కమిషన్ చేసిన సిఫార్సులను కూలంకశంగా పరిశీలించింది. అక్తర్ నివేదిక చేసిన సూచనలను సబ్ కమిటీ మంత్రివర్గానికి సిఫార్సు చేయనుంది.

మంగళవారం జరగనున్న క్యాబినెట్ మీటింగ్‌లో ఎస్సీ వర్గీకరణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీలో బీసీ కులగణనతో పాటు ఈ అంశంపై కూడా చర్చించనున్నారు.

సీఎం ఇంటికి మంత్రులు

మంగళవారం రాత్రి సబ్ కమిటీ భేటీ తర్వాత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ సీఎం ఇంటికి వెళ్లారు. కమిషన్ చేసిన సిఫార్సులపై మంత్రి ఉత్తమ్ సీఎంకు బ్రీఫింగ్ చేసినట్లు సమాచారం. అలాగే, ఈ నివేదికపై మంగళవారం అసెంబ్లీలో చర్చించనున్న నేపథ్యంలో.. దీనిపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై కూడా సీఎం మాట్లాడినట్లు సమాచారం.