calender_icon.png 18 October, 2024 | 5:03 AM

త్వరలో ఆలయాల వర్గీకరణ!

18-10-2024 02:26:52 AM

  1. పదేళ్లకోసారి జరగాల్సినా గత ప్రభుత్వ నిర్లక్ష్యం
  2. విభజించేందుకు తాజాగా దేవాదాయ శాఖ కసరత్తు
  3. ఆలయ విస్తీర్ణం, ఆదాయాన్ని బట్టి అధికారుల నియామకం

హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాల నిర్వహణ, సౌకర్యాల కల్పన, సిబ్బంది నియామకం, ఆస్తులు, భూముల పర్యవేక్షణ వంటి అంశాలు సజావుగా జరగాలంటే ఆయా ఆలయాల వర్గీకరణ ఎంతో అవసరం.

ఈ వర్గీకరణ ద్వారా ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టడం సులభతరమవుతుంది. కానీ, తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఒక్కసారీ రాష్ట్రంలో ఈ ప్రక్రియ నిర్వహించలేదు. ఆలయాల వర్గీకరణ అంశంపై గత ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని అవలంబించింది.

పదేళ్లు అధికారంలో కొనసాగినప్పటికీ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక ఆలయాల్లో సిబ్బంది కొరత, సౌకర్యాల కల్పన వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దాంతో ఆలయాల వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. 

పదేళ్లకోసారి వర్గీకరణ 

నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ప్రతి పదేళ్లకోసారి ఆలయాల వర్గీకరణ తప్పకుండా జరగాలి. కానీ, ప్రభుత్వానికి పట్టింపు లేక ఈ అంశంపై జాప్యం జరిగింది. తెలంగాణ ఏర్పడే నాటికే ఆలయాల వర్గీకరణ జరగాల్సి ఉన్నప్పటికీ గత పాలకులు దీనిపై దృష్టి సారించలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని దేవాదాయ శాఖ..

ఆలయాల్లో నెలకొన్న సమస్యలు తెలుసుకోవడంపై ప్రత్యేక చొరవ చూపింది. ఈ క్రమంలో రాష్ట్రంలో మొత్తంగా 12 వేల దేవాలయాలు ఉన్నాయని గుర్తించినట్టు సమాచారం. వీటిలో కొన్ని ఆలయాల ద్వారా అధిక మొత్తం ఆదాయం సమకూరుతుందని గమనించింది. కానీ, చాలా ఆలయాల్లో వర్గీకరణ జాప్యం కావడంతో సిబ్బంది కొరత తలెత్తినట్టు అధికారుల పరిశీలన వెలుగుచూసినట్టు తెలిసింది.

విస్తీర్ణం, ఆదాయాన్ని బట్టి నియామకాలు

ఆలయాల వర్గీకరణకు సంబంధించిన ప్రతిపాదనను దేవాదాయ శాఖ అధికారులు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. ప్రభుత్వ అనుమతితో వెంటనే అనేక సమస్యలకు పరిష్కారం లభించనున్నది. ముఖ్యంగా చాలామంది పదోన్నతి కోసం ఎదు రు చూస్తుండటంతోపాటు దేవాదాయ శాఖలో ఇతర కొత్త ఉద్యోగాలకు మార్గం సుగ మం కానున్నది.

అయితే, దేవాలయాల విస్తీర్ణం, ఆర్జిం చే ఆదాయ వనరులను బట్టి ఉన్నతాధికారుల నియామకం చేపట్టనున్నట్టు తెలుస్తోంది. భద్రాచలం, వేములవాడ వంటి ప్రతిష్ఠాత్మకమైన దేవాలయాలకు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులను నియమించనున్నారని సమాచారం. 

మంత్రి కొండా సురేఖ చొరవ 

రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మంత్రి కొండా సురేఖ ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాలను సందర్శిస్తూ, సమస్యలపై ఆరా తీస్తూ పరిష్కారాలపై అధికారులతో చర్చిస్తున్నారు.

అందులో భా గంగా ఏండ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్న ఆలయాల వర్గీకరణ అంశాన్ని పరిష్కరించే విధం గా చర్యలు తీసుకుంటున్నారు. గత పాలకుల ధోరణితో అనేక ఆలయాల్లో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మంత్రి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఆలయాల అభివృద్ధి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపిస్తున్నారు.