ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ అధికారం రాష్ట్రాలకు ఉంది
సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. 2004 నాటి తీర్పుకు సవరణ
6:1 తేడాతో తీర్పుచెప్పిన రాజ్యాంగ ధర్మాసనం
న్యూఢిల్లీ, ఆగస్టు 1: సుదీర్ఘకాలంగా రగులుతున్న ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. ఈ వర్గాలకు ఉన్న రిజర్వేషన్లలో ఉప వర్గీకరణ చేయవచ్చని ప్రకటించింది. రిజర్వేషన్ల వర్గీకరణ అధికారం రాష్ట్రాలకు ఉన్నదని తెలిపింది. వర్గీకరణకు రాష్ట్రాలు సొంతంగా మార్గదర్శకాలు రూపొందించుకోవాలని ఆదేశిం చింది.
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, పంజాబ్ ప్రభుత్వంతోపాటు వర్గీకరణ కోసం దాఖలైన మొత్తం 22 పిటిషన్లను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వం లోని రాజ్యాంగ ధర్మాసనం ఈ చారిత్రక తీర్పు వెలువరించింది. ఈ ధర్మాసనంలో సీజేఐతోపాటు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎస్‌సీ శర్మ ఉన్నారు. ఏడుగురు న్యాయమూర్తుల్లో ఆరుగురు రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వగా, బేలా త్రివేదీ వ్యతిరేకంగా తీర్పు ప్రకటించారు.
రాష్ట్రాలకు అధికారం ఉంది
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని సుప్రీంకోర్టు ప్రకటించింది. 2004తో ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ‘ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను వర్గీకరించటం రాజ్యాంగ విరుద్ధమేమీ కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ద్వారా సంక్రమించిన సమానత్వ సూత్రానికి కూడా వ్యతిరేకం కాదు. ఈ వర్గాల్లోని కొన్ని కులాల వారు మాత్రమే రిజర్వేషన్లను అనుభవిస్తున్నారు. క్షేత్రస్థాయి వాస్తవాలను తిరస్కరించలేం. ఎస్సీ, ఎస్టీల్లోని కొన్ని కులాలు శతాబ్దాలుగా మరింత తీవ్రమైన అణచివేతను అనుభవిస్తున్నాయి. వారిలో సమానత్వం సాధించేందుకు వర్గీకరణే సరైన మార్గం’ అని జస్టిస్ గవాయ్ తన తీర్పులో పేర్కొన్నారు.
క్రిమిలేయర్ నిర్ధారణ తర్వాతే వర్గీకరణ
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేయాలంటే రాష్ట్రాలు ముందుగా ఆయా వర్గాల్లో క్రీమీ లేయర్‌ను నిర్ధారించాలని సుప్రీంకోర్టు షరతు విధించింది. ఓబీసీల్లో ప్రస్తుతం క్రీమీలేయర్ విధానం అమలవుతున్నది. రూ.8 లక్షలకు మించి వార్షికాదాయం ఉన్నవారికి రిజర్వేషన్లు వర్తించవు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణలో కూడా ఇలాంటి విధానం ఉండాలని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పష్టంచేశారు. ఎస్సీ, ఎస్టీ జనాభా, కులాలవారీగా వారి ఆర్థిక, సామాజిక స్థితిని శాస్త్రీయంగా అంచనా వేసిన తర్వాతనే వర్గీకరణ చేపట్టాలని ఆదేశించారు.
ఇప్పటికే విద్య, ఉద్యోగాల్లో ఆయా వర్గాల్లోని కులాలవారీగా ఏ కులంవారు ఎంతమంది ఉన్నారనే లెక్కలు తీయాలని ఆదేశించింది. ‘ఎస్సీల్లో ఇప్పటికే రిజర్వేషన్లు అనుభవిస్తున్నవారి పిల్లలతో ఇంకా రిజర్వేషన్లు అందుకోలేని స్థితిలో ఉన్నవారి పిల్లలను ఒకే గాటన కట్టలేము’ అని ధర్మాసనం స్పష్టంచేసింది. రాష్ట్రాలు చేపట్టే క్రీమీలేయర్ నిర్ధారణ విధానాలు రాజ్యాంగ నియమాలకు లోబడి ఉండాలని జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ సూచించారు. ‘ఒక కుటుంబంలోని మొదటి తరం వ్యక్తి రిజర్వేషన్లను వాడుకొని ఉన్నత స్థానానికి ఎదిగితే, ఆ కుటుంబంలోని తర్వాతి తరం వారికి రిజర్వేషన్ ఇవ్వకూడదు’ అని జస్టిస్ పంకజ్ మిట్టల్ పేర్కొన్నారు.
రిజర్వేషన్ల విభజన రాజ్యాంగ విరుద్ధం
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను వర్గీకరించటం రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనంలోని న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేదీ తీర్పు చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ఈ వర్గాల రిజర్వేషన్ల వర్గీకరణతో విభేదిస్తున్నదని ఆమె తన తీర్పులో పేర్కొన్నారు. ‘రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రిజర్వేషన్ క్యాటగిరీలో చేర్చిన కులాలను అందులో ఉంచాలన్నా, తీసివేయాలన్నా పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉన్నది. ఇప్పుడు రిజర్వేషన్లను వర్గీకరించటం ప్రెసిడెన్షియల్ లిస్ట్‌ను సవరించినట్టు అవుతుంది. ఇలా చేయటం వల్ల ఇతర కులాలు నష్టపోవచ్చు’ అని పేర్కొన్నారు.
సుదీర్ఘ పోరాటం
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీల్లో అనేక ఉప కులాలున్నాయి. అయితే, వీరికి ఉన్న రిజర్వేషన్లను కొన్ని కులాలు మాత్రమే అధికంగా అనుభివిస్తున్నాయి. దీంతో రిజర్వేషన్లను అందిపుచ్చుకో లేకపోతున్న వర్గాలు ఈ రిజర్వేషన్లను వర్గీకరించి తమకు న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పోరాడుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో అప్పటి ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్లలో ఏ, బీ, సీ,డీ అని నాలుగు వర్గాలుగా ఏర్పాటుచేసింది. దీనిని సవాల్ చేస్తూ ఈవీ చిన్నయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానిని విచారించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం రాష్ట్రాలకు లేదని, పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని తీర్పు చెప్పింది.
దీంతో ఏపీలో వర్గీకరణ ఆగిపోయింది. తమిళనాడు, పంజాబ్‌లో కూడా ఇలాంటి వివాదాలే ఉన్నాయి. పంజాబ్ ప్రభుత్వం ఎస్సీల్లోని వాల్మీకి, మజహబి కులాలకు మొత్తం రిజర్వేషన్లలో 50 శాతాన్ని కేటాయిస్తూ 2006లో చట్టం చేసింది. దీనిని పలువురు పంజాబ్ హైకోర్టులో సవాల్ చేయగా, 2010లో ఆ చట్టాన్ని కోర్టు కొట్టివేసింది. అందుకు 2004లో ఈవీ చిన్నయ్య వర్సెస్ ఏపీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించింది. హైకోర్టు తీర్పును పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తమిళనాడులో అరున్‌తతియార్స్ చట్టం విషయంలో కూడా ఇలాంటి వివాదమే ఉన్నది. దీంతో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టులో 22 పిటిషన్లు దాఖలయ్యాయి. అందులో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ దాఖలు చేసిన పిటిషన్ కూడా ఉన్నది. పంజాబ్ పిటిషన్‌ను ధర్మాసనం ప్రధాన వ్యాజ్యంగా స్వీకరించింది. సుదీర్ఘ వాదనల తర్వాత రాజ్యాంగ ధర్మాసనం గురువారం సవివరమైన తీర్పును ప్రకటించింది.