15-04-2025 12:49:00 AM
హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమల్లోకి వచ్చిందని వర్గీకరణ సబ్‌కమిటీ చైర్మన్, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. వర్గీకరణ అమలు కోసం జీవో నెంబర్ 9ని విడుదల చేశామని, ఆ జీవో కాపీని సీఎం రేవంత్ రెడ్డికి అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. రూల్స్ కోసం జీవో నంబర్ 10ని కూడా విడుదల చేశామని తెలిపారు.
ప్రభుత్వ ఖాళీలను భారీఎత్తున భర్తీ చేస్తామని, వాటన్నింటికీ వర్గీకరణ వర్తిస్తుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పా రు. గతేడాది ఆగస్టు 1వ తేదీకి ముందు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తించదన్నారు. భవిష్యత్‌లో 2026లో చేపట్టే జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామన్నారు.
కాగా, డా.బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని వర్గీకరణ చట్టాన్ని అమల్లోకి తీసుకు రావడం ద్వారా ఆయనకు గొప్ప నివాళి అర్పించినట్టుగా అభివర్ణిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌లో ట్వీట్ చేశారు. సోమవారం సచివాలయంలో మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ తదితరులతో కలిసి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌కు లోబడే ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో వర్గీకరణ అమలవుతుందని చెప్పారు.
ఈ చరిత్రా త్మక ఘట్టంలో పాల్గొనడం చాలా సంతోషం గా ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లపై అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్నామన్నారు. వర్గీకరణ పూర్తయ్యేవరకు ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు ఇవ్వొద్దని ఆనాడే చెప్పామని మంత్రి గుర్తుచేశారు.
మంగళవారం వర్గీకరణపై నియమించిన స బ్‌కమిటీ ఉన్నతాధికారులతో సమావేశమై నోటిఫికేషన్ ప్రక్రియపై చర్చిస్తామని, త్వరలోనే నోటిఫికేషన్లు విడుదలవుతాయన్నారు. వర్గీకరణ అమలు కోసం నియమించిన వన్‌మ్యాన్ జ్యూడీషియల్ కమిషన్ షమీమ్ అక్తర్‌కు వచ్చిన 50 వేల వినతులను పరిశీలన చేసి ఎస్సీ రిజర్వేషన్లను మూడు కేటగిరీ లుగా విభజన చేశామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరించారు.
15 శాతం ఎస్సీ రిజర్వేషన్లను గూప్-1లో 15 కులాలను చేర్చుతూ 1 శాతం రిజర్వేషన్లు, గ్రూప్-2లో 18 కులాలను చేర్చుతూ 9 శాతం, గ్రూప్ 3లో 26 కులాలను చేర్చి 5 శాతం కల్పించి.. వర్గీకరణకు అసెంబ్లీలో చట్టం చేశామని, గవర్నర్ కూడా ఆమోదం తెలిపారని మంత్రి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వర్గీకరణ అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని, ఈ గ్రూప్‌ల ప్రాధాన్యం ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.
జీవో నంబర్ 29 ప్రకారం రోస్టర్ పాయింట్స్ కేటాయింపు ఉంటుందన్నారు. మంత్రి దా మోదర రాజనరసింహ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ ఇక అమల్లోకి వచ్చిందన్నారు. దళితుల్లో సామాజిక, ఆర్థిక వ్యత్యాసాలు ఉండకూడదన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సబ్‌కమిటీ ఏర్పా టు చేసుకున్నామని, సబ్‌కమిటీకి వచ్చిన వేలాది విజ్ఞప్తులను కూడా అధ్యయనం చేశామన్నారు.
విద్య, ఉద్యోగాల్లో ఇకపై ఇచ్చే నోటిఫికేషన్లకు వర్గీకరణ అమలవుతుందని, ఇక భారీస్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నామని మంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఎస్సీ సబ్‌ప్లాన్ చేసే అవకాశం వచ్చిందని, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను సీడబ్ల్యూసీలో సోనియాగాంధీ సహా కాంగ్రెస్ నాయకత్వానికి, నాటి కేంద్ర ప్రభు త్వ పెద్దలకు వినిపించే అవకాశం దక్కిందన్నారు. ఇప్పుడు వర్గీకరణ అంశంలో భాగ మయ్యే అవకాశం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు రాజనరసింహ తెలిపారు.
ఎస్సీల్లోని 59 కులాలు మూడు గ్రూప్‌లుగా విభజన..
గ్రూప్-1లో 15 కులాలు..
1,71,625 మంది జనాభా
1. బావురి, 2. బేడ బుడగ జంగం, 3. చచాటి, 4.డక్కలి- డొక్కల్వార్, 5.జగ్గలి, 6.కొలుపుల వాండ్లు, పంబాడ, పంబండ, పంబాల, 7.మాంగ్, 8.మాంగ్ గరోడి, 9.మన్నె, 10.మాష్తీ, 11.మాతాంగి, 12.మేహతర్, 13. ముండాల, 14. సంబన్, 15. సప్రు
గ్రూప్ -2లో 18 కులాలు.. 32,74,437 మంది జనాభా
1. అరుంధతీయ, 2. బైండ్ల , 3. చమార్, మోచి, ముచి, చమార్-రవిదాస్, చమార్- రోహిదాస్, 4. చంబర్, 5. చండాల, 6. దండాసి, 7. డోమ్, దొంబరా, పైడి, పానో , 8.ఎల్లమ్మల్వార్, ఎల్లమ్మవాండ్లు, 9.గోడారి, 10. జాంబువులు, 11. మాదిగ, 12.మాదిగ దాసు, మాస్తీన్ , 13.పామిడి, 14. పంచమ, పరియ, 15. సమగర, 16. సిందోళ్లు, చిందోళ్లు , 17. యాటల, 18. వల్లూవన్
గ్రూప్-3లో 26 కులాలు..
17,71,682 మంది జనాభా..
1. ఆది ఆంధ్ర, 2. ఆది ద్రవిడ, 3. అనామక్, 4. ఆర్యమాల, 5. అర్వమాల, 6. బైరికి, 7. బ్యాగర, బ్యాగరి, 8. చల్వాడి, 9. దోర్, 10. గాసి, హడ్డి, రెల్లి, చంచాడి, 11.గోసంగి, 12. హోలియ, 13. హోలియ దాసరి, 14. మాదాసి కురువ, మాదారి కురువ, 15. మహర్, 16. మాల, మాల అయ్యవార్, 17. మాల దాసరి, 18. మాల దాసు, 19. మాల హన్నాయ్ , 20. మాల జంగం, 21. మాల మాస్టి, 22. మాల సాలె, నేతకాని 23. మాల సన్యాసి, 24. మిత అయ్యల్‌వార్, 25. పాకే, మోటి, తోటి, 26. రెల్లి
ఎస్సీల్లో ఎక్కువ జనాభా
కలిగిన కులాలు..
1. మాదిగ - 32,33,642మంది జనాభా
2. మాల, మాల అయ్యవార్ -15,27,143మంది జనాభా
3. మాలసాలె, నేతకాని - 1,33,072 మంది జనాభా
4. బేడ బుడగ జంగం- 1,11,710 మంది జనాభా
సామాజిక న్యాయం, సమాన అవకాశాలు..
సామాజిక న్యాయం, సమాన అవకాశాలను అందరికీ కల్పించాలన్న డా.బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున ప్రజా ప్రభుత్వం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి వర్గ ఉప సంఘం జీవో తొలి కాపీని అందజేసింది.
సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జీ చిన్నారెడ్డి, ఏక సభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్, ఎంపీలు అనిల్‌కుమార్ యాదవ్, పోరిక బలరాం నాయక్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
విప్లవాత్మక నిర్ణయం: సీఎం రేవంత్‌రెడ్డి హర్షం
విప్లవాత్మక నిర్ణయం తీసుకుని ఎస్సీ వర్గీకరణను అమలు చేయడంలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ఎస్సీ వర్గీకరణ అంశం ఎంతో గర్వించదగ్గ విషయమని స్పష్టం చేశారు.