- మహాత్ముడి స్ఫూర్తితోనే యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ
- ఇంతగొప్ప బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ సభకొస్తే బాగుండేది
- స్కిల్ యూనివర్సిటీ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
- ఎస్సీలకు ఏ,బీ,సీ,డీ వర్గీకరణ అమలు చేస్తాం
- శాసన సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం
హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): ప్రస్తుతం అమలులో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్‌లో కూడా మాదిగ, మాదిగ ఉప కులాలకు ఎస్సీ వర్గీకరణ అందరికంటే ముందే అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. ఇందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని స్పష్టంచేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. ద్రవ్యవినిమయ బిల్లుపై జరుగుతున్న చర్చలో భాగంగా గురువారం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ అంశంపై సీఎం ప్రసంగించారు.
మాదిగ, మాదిగ ఉప కులాలకు వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే గత ప్రభుత్వం తమ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు. 2023 డిసెంబర్ 23న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, అడ్వొకేట్ జనరల్‌ను సుప్రీంకోర్టుకు పంపించామని, వర్గీకరణపై సుప్రీంకోర్టులో న్యాయ నిపుణులతో రాష్ట్రం వాదనలు వినిపించినట్టు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించిందని తెలిపారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నామని అన్నారు.
గాంధీ స్ఫూర్తితో స్కిల్ యూనివర్సిటీ
నాడు జవహర్‌లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చి వ్యవసాయం, విద్యకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్ అందుబాటులోకి తెచ్చారని చెప్పారు. విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇచ్చి ఇందిర ప్రోత్సహించారని అన్నారు. రాజీవ్‌గాంధీ దేశానికి సాంకేతికను అందుబాటులోకి తీసుకొచ్చారని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు హైటెక్ సిటీ నిర్మాణానికి భూమి పూజ చేశారని పేర్కొన్నారు. ప్రపంచంలో నైపుణ్యం ఉన్నవారి కొరత ఉందని, వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్ల నిరుద్యోగం పెరుగుతోందని చెప్పారు. అందుకే అందరికీ అన్ని రకాల నైపుణ్యాలను అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని పునరుద్ఘాటించారు.
మహాత్మాగాంధీ నడిపిన యంగ్ ఇండియా పత్రిక స్ఫూర్తిగా స్కిల్ యూనివర్సిటీకి ఆ పేరు పెడుతున్నట్టు వెల్లడించారు. లక్షలాది యువతకు ఉపాధి కల్పించడమే దీని లక్ష్యమని చెప్పారు. స్కిల్ యూనివర్సిటీపై ప్రధాన ప్రతిపక్ష నాయకులు సూచనలు ఇస్తే సంతోషించేవాళ్ళమని, ఇంత గొప్ప బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత సభకు రాకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. వచ్చిన వారూ వాకౌట్ చేసి వెళ్లిపోయారని చెప్పారు. స్కిల్ యూనివర్సిటీలో 17 వైవిధ్యమైన కోర్సులను తీసుకువస్తున్నామని తెలిపారు.
స్కిల్ వర్సిటీలో కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందిస్తామని చెప్పారు. ఏడాదికి రూ.50 వేలు నామ మాత్రపు ఫీజుతో కోర్సుల శిక్షణ అందించనున్నట్టు, అవసరమైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ఉచితంగా శిక్షణ అందిస్తామని స్పష్టంచేశారు. సాయంత్రం స్కిల్ యూనివర్సిటీకి భూమిపూజ చేసుకోబోతున్నామని తెలిపారు. ఈ ఏడాది 6 కోర్సులకు 2వేల మందికి అడ్మిషన్స్ ఇస్తున్నామని వివరించారు. శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేందుకు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయని సీఎం వెల్లడించారు. భవిష్యత్తులో జిల్లాల్లోనూ కళాశాలలు ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చే ఆలోచన ఉందన్నారు. బీఆర్‌ఎస్ నేతలకు రాజకీయ ప్రయోజనం తప్ప ప్రజల ప్రయోజనం పట్టదని మండిపడ్డారు.
ఆడబిడ్డలను అడ్డం పెట్టుకుని రాజకీయం
రైతు రుణమాఫీపై చర్చ జరగకూడదని బీఆర్‌ఎస్ నేతలు ఆడబిడ్డలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీపై చర్చ అడ్డుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ‘ఆ అక్కలను నేను నా సొంత అక్కలుగానే భావించా.. సీతక్కపై సోషల్ మీడియాలో అవమానించేలా మీమ్స్ పెడుతున్నారు. ఇది ఆదివాసీ ఆడబిడ్డను అవమానించినట్టు కాదా? సొంత చెల్లెల్ని జైల్లో పెట్టినా ఢిల్లీ వెళ్లి రాజకీయ ఒప్పందం చేసుకున్న నీచులు వాళ్లు. అక్కా మీరు వాళ్ల ఉచ్చులో పడొద్దు’ అని సబిత, సునీతాలక్ష్మారెడ్డిని ఉద్దేశించి అన్నారు. మీ ముందు కింద కూర్చో కూడదనే కేసీఆర్ సభకు రావడం లేదు అధ్యక్షా. కేసీఆర్‌కు రాజకీయ జీవితం ఇచ్చిందే కాంగ్రెస్.
హరీశ్‌ను మంత్రి చేసింది కాంగ్రెస్ కాదా? మైక్ ఇస్తే శాపనార్థాలు.. ఇవ్వకపోతే పోడియం దగ్గర నిరసనలు చేస్తున్నారని మండిపడ్డారు. చెల్లెలు జైల్లో ఉంటే తాను రాజకీయాల కోసం బజార్లో తిరిగేవాన్ని కాదని చెప్పారు. దొర పన్నిన కుట్రలో మా అక్కలు బందీ అయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. అక్కల క్షేమం కోరే చెప్తున్నా.. వాళ్ల ఉచ్చులో పడొద్దని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో ఉద్ధండులైన న్యాయవాదులతో వాదించేలా కృషి చేశామని, దళిత బిడ్డలు సంతోషపడే రోజు వస్తే నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పారు. కానీ, ప్రధాన ప్రతిపక్షం వాకౌట్ చేసి వెళ్లిపోయిందని విమర్శించారు. అందుకే వాళ్ల నుంచి ఏమైనా ఆశిస్తే.. కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టేనని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు దేవుడు జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటున్నామని చెప్పారు. స్కిల్ యూనివర్సిటీ భూమిపూజకు రావాల్సిందిగా అందరినీ కోరుతున్నామని సీఎం సభ్యులను ఆహ్వానించారు.